దమ్‌ మారో దమ్‌ | Software employees having Drugs | Sakshi
Sakshi News home page

దమ్‌ మారో దమ్‌

Published Wed, Jun 28 2017 1:06 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

దమ్‌ మారో దమ్‌ - Sakshi

దమ్‌ మారో దమ్‌

టెక్కీల గం‘జాయ్‌’
 
నిత్యం కంప్యూటర్లతో కుస్తీపట్టే సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు డ్రగ్స్‌కు బానిసలయ్యారా? లక్షల్లో జీతాలు తీసుకుంటూ విలాస జీవితాలు అనుభవించే టెక్కీలు మత్తులో జోగుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చదువుకునేందుకు హైదరాబాద్‌ వచ్చి డ్రగ్స్‌ దందా సాగిస్తున్న ఇద్దరు సోమాలియా దేశ విద్యార్థులను ఆబ్కారీశాఖ ఇటీవల అరెస్టు చేసి విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా, విశాఖ ఏజెన్సీల నుంచి కిలో కేవలం రూ. 3 వేల చొప్పున 20–25 కిలోల గంజాయిని కొనుగోలు చేస్తున్న డ్రగ్స్‌ ముఠాలు దాన్ని రైళ్లలో తొలుత వరంగల్‌కు తరలిస్తున్నాయి. అక్కడి నుంచి ట్రాలీ ఆటోల అడుగున గంజాయిని ప్యాకెట్ల రూపంలో దాచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నాయి.
– సాక్షి, హైదరాబాద్‌
 
కాలేజీ విద్యార్థులు,సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు విక్రయం
రవాణా చేసిన గంజాయిని కాలేజీ విద్యార్థులతోపాటు శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్‌ ముఠాలు విక్రయిస్తున్నాయి. అలాగే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఒక గ్రాము, రెండు గ్రాముల చొప్పున గంజాయిని సిగరెట్లలో పెట్టి ఒక్కో సిగరేట్‌ను రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇక్కడ అమ్మగా మిగిలిన గంజాయిని గోవాకు తరలించి కిలోకు రూ. 45 వేల నుంచి రూ. 50 వేల చొప్పున తాజా పట్టుబడిన సోమాలియన్లు విక్రయిస్తున్నట్లు తేలింది.
 
సర్జికల్‌ డ్రగ్‌నూ మత్తు కోసం
హాస్పిటళ్లలో ఆపరేషన్ల సమయంలో ఉపయోగించే పెంటాజోకిన్‌ కెమికల్‌ ఉన్న పార్ట్విన్‌ ఇంజక్షన్‌ను కూడా సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు మత్తు పదార్థంగా ఉపయోగిస్తున్నారు. కేవలం హాస్పిటళ్లు, లైసెన్స్‌డ్‌ డ్రగ్‌ సెంటర్లలో డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ ఉంటేనే ఈ డ్రగ్‌ను విక్రయించాలని ఆదేశాలున్నా ఏపీలోని తిరుపతి, విశాఖ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. హెరాయిన్, కొకైన్‌ లాంటి డ్రగ్స్‌ రవాణా గుట్టురట్టవుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇప్పుడు ఇలాంటి సర్జికల్‌ డ్రగ్స్‌ను వాడుతున్నారు.
 
ఉన్మాదిగా మారే ప్రమాదం
సాధారణంగా పెంటాజోకిన్‌ కెమికల్‌ను పెయిన్‌ రిలీఫ్‌కు వాడుతుంటారు. అది కూడా డాక్టర్‌ సిఫారసు చేస్తేనే ఇస్తారు. కానీ ఈ డ్రగ్‌కు బానిసలైన వారు రోజుకు రెండు నుంచి మూడు డోసుల చొప్పున (అంటే తీసుకున్నప్పుడల్లా 3 ఎంఎల్‌.. రోజుకు 9ఎంఎల్‌ చొప్పున) వాడుతున్నారు. దీనివల్ల అధిక రక్తపోటు, గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెదడు, నాడీకణాల పనితీరు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్యులు తెలిపారు. దీన్ని అధిక మోతాదులో తీసుకున్న సందర్భంలో ఆ వ్యక్తి ఉన్మాదిలా వ్యవహరించే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 
 
దర్యాప్తు చేస్తున్నాం
తాజాగా అరెస్టయిన సోమాలియా విద్యార్థులు ఈ దందాను ఇప్పుడిప్పుడే ప్రారంభించినట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై తమ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. అలాగే నిత్యం 250 ఎంఎల్‌ నుంచి 500 ఎంఎల్‌ వరకు పెంటాజోకిన్‌ను దిగుమతి చేసుకొని 2 ఎంఎల్‌కు రూ. 500 చొప్పున సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు విక్రయిస్తున్న ఇద్దరిని తాము అరెస్ట్‌ చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement