
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
మానసిక ఒత్తిడే కారణమంటున్న పోలీసులు
హైదరాబాద్: మానసిక ఒత్తిడికి లోనై ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జార్ఖండ్‌కు చెందిన దంపతులు సత్యనారాయణ సింగ్, పుష్పసింగ్‌ల కుమార్తె రాణీమనీషా(21) గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆరు నెలలుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. కిందటేడాది ఆగస్టు 7వ తేదీ నుంచి గచ్చిబౌలిలోని న్యూ బాలాజీ ఉమెన్స్ హస్టల్ రూమ్‌లో ఒక్కతే ఉంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఏడు గంటలకు హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ వద్ద గల్లీలో చనిపోయి ఉండటాన్ని హాస్టల్ నిర్వాహకులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మృతదేహన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి 10 గంటలకు రూమ్‌లోకి వెళ్లడం అక్కడి ఉద్యోగులు చూశారని, ఉదయం 4 గంటలకు ఆమె స్నేహితులకు ఫోన్ చేయగా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.ఉదయం 5 గంటల తర్వాతే నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
మానసిక ఒత్తిడే కారణం
ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు, మానసిక ఒత్తిడే కారణమని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. కొద్దిరోజులగా హాస్టల్‌లో, కంపెనీలో ఎవరితోనూ మాట్లాడటం లేదని, ఒంటరిగా ఉంటుందని వారు పేర్కొన్నారు. మనీషా ఇటీవల పది రోజుల పాటు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఫిబ్రవరి 25న హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. కుమార్తె కొద్ది రోజులుగా ఎవరితోను సరిగా మాట్లాడటం లేదని తెలిసిన మనీషా తల్లి పుష్పసింగ్ మంగళవారం స్నేహితులకు ఫోన్ చేసింది. మనీషాను ఆస్పత్రిలో చూపించి ఊరికి తీసుకెళతానని స్నేహితులతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె హైదరాబాద్‌కు బయలుదేరింది. బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో కూతురు మృతదేహన్ని చూసి గుండెలవిసేల విలపించింది.
ఆవుతో ఆప్యాయంగా...
ఆత్మహత్యకు పాల్పడిన రాణీ మనీషాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. యోగా పుస్తకాలు చదువుతుందని, దైవ భక్తి ఎక్కువని హాస్టల్ నిర్వాహకులు తెలి పారు. ప్రతిరోజు ఆవుకు పండ్లు తినిపించడం రాణికి అలవాటు. ఫిబ్రవరి 26న పండ్లు తీసుకొని రాగా ఆవు కనిపించకపోవడంతో కంగారుపడ్డ ఆమె.. కొద్ది దూరం వెళ్లి ఆవును హస్టల్ వద్దకు తీసుకొచ్చింది. పండ్లు తినిపించిన అనంతరం కొద్ది నిమిషాల పాటు ఆవును నిమిరింది. హాస్టల్‌లోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలను చూసిన పలువురి కళ్లు చెమర్చాయి.