ఇంకా అసమానతలే!
- జిల్లా, కుల, లింగ, వృత్తి వర్గాల మధ్య కొనసాగుతున్న అసమానతలు
- మానవాభివృద్ధి సూచీలో పదో స్థానంలో రాష్ట్రం
- 2004–05తో పోల్చితే 2011–12లో మూడు స్థానాలు మెరుగు
సాక్షి, హైదరాబాద్: సాంకేతికపరంగా ప్రపంచం ముందుకు దూసుకుపోతున్నా.. సమాజంలో అసమానతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కూడా పరిస్థితులు ఇందు కు భిన్నంగా ఏమీ లేవు. ఇదే విషయాన్ని తెలంగాణ మానవాభివృద్ధి నివేదిక–2017 వెల్లడించింది. రాష్ట్రంలోని జిల్లాల మధ్య, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య, కులాల మధ్య, స్త్రీ, పురుషుల మధ్య, వృత్తి వర్గాల మధ్య ఇంకా అసమానతలు కొనసాగుతు న్నాయని వివరించింది. ‘మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ) ర్యాంకింగ్స్‌లో 2004–05లో తెలంగాణ 13వ స్థానంలో ఉండగా, 2011–12 నాటికి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని పదో స్థానంలో నిలిచింది.
జాతీయ సగటు కన్నా రాష్ట్ర మానవాభివృద్ధి సూచీ మెరుగ్గా ఉంది. 2004–05లో భారతదేశ మానవాభివృద్ధి సూచీ 0.361 కాగా, రాష్ట్రం విలువ 0.343గా నమోదైంది. అయితే, 2011–12లో దేశ సూచీ విలువ 0.48కు పెరగగా, రాష్ట్రం విలువ అంతకు మించి 0.513గా నమోదైంది. ఇదే సమయంలో తక్కువ హెచ్‌డీఐ ఉన్న జిల్లాలు కూడా మెరుగుపడ్డాయి. జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, విద్యలో అసమానతలు సైతం తగ్గుముఖం పట్టాయి. అయితే అసమానతలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి’అని మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది. సెంటర్ ఫర్ ఎకనమిక్, సోషల్ స్టడీస్ (సెస్) రూపొందించిన ఈ నివేదికను శుక్రవారం గుజరాత్ సెంట్రల్ వర్సిటీ చాన్స్‌లర్, మాజీ కేంద్ర మంత్రి ప్రొఫెసర్ వైకే అలగ్ ఆవిష్కరించారు. ఈ నివేదికపై ‘సెస్’ ప్రొఫెసర్ ఎస్.గలాబ్ పరిచయ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో సెస్ చైర్మన్ ఆర్.రాధాకృష్ణ, ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఎస్‌ఆర్ హషీం, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ గౌరవాధ్యక్షుడు ఆర్ మారియా సాలెత్ పాల్గొన్నారు.
హైదరాబాద్ టాప్.. మెదక్ లాస్ట్
రాష్ట్ర స్థాయిలో హెచ్‌డీఐ ర్యాంకింగ్స్‌లో హైద రాబాద్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా మెదక్ జిల్లా మరో స్థానం పతనమై అట్టడుగున నిలిచింది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు తమ స్థానాలు నిలబెట్టుకోగా, మిగిలిన 5 జిల్లాల ర్యాంకుల్లో స్పల్ప మార్పులొచ్చాయి.
మాతా, శిశు మరణాలు..
వైద్య సదుపాయాల లేమితో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆరోగ్య స్థితిగతుల్లో మార్పు రాలేదు. జాతీయ కుటుంబ సర్వే 2015–16 ప్రకారం రాష్ట్రంలో శిశు మరణాల రేటు 28. తల్లుల మరణాల రేటు విషయంలో జిల్లాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయి. హైదరాబాద్‌లో తల్లుల మరణాల రేటు 71 ఉండగా, ఆదిలాబాద్‌లో 152 ఉంది.
ఆర్థికాభివృద్ధి–మానవాభివృద్ధి మధ్య పెరిగిన దూరం
రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి మధ్య సంబంధం బలహీనపడింది. 2004–05తో పోల్చితే సమాన మానవాభివృద్ధి సాధించేందుకు 2011–12లో మూడు రెట్ల ఆర్థికాభివృద్ధి సాధించాల్సి ఉంది. మానవాభివృద్ధికి సమ్మిళిత అభివృద్ధి లేని అధిక ఆర్థికాభివృద్ధి కన్నా సమ్మిళిత అభివృద్ధి సహకరించింది. తక్కువ ఆర్థికాభివృద్ధి ఉన్నా సమ్మిళిత అభివృద్ధి గల జిల్లాలు అధిక ఆర్థికాభివృద్ధి గల జిల్లాలతో మెరుగైన మానవాభివృద్ధిని సాధించాయి. అంటే ఆర్థికాభివృద్ధికి మానవాభివృద్ధితో సంబంధం లేదని తెలుస్తోంది.
సామాజికంగా..
ఎస్టీల హెచ్‌డీఐతో పోల్చితే ఓసీల హెచ్‌డీఐ 2002–04లో 2.20 రెట్లు అధికంగా ఉండగా, 2007–08లో 1.73 రెట్లకు తగ్గింది. కాలంతో పాటు సామాజిక తరగతుల మధ్య హెచ్‌డీఐ వ్యత్యాసాలు తగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాల హెచ్‌డీఐ అధికంగా ఉంది. గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గాయి.
స్త్రీ, పురుషుల మధ్య..
రాష్ట్రంతో పాటు జిల్లాలో కూడా 2004–05తో పోల్చితే 2011–12లో స్త్రీ, పురుషుల హెచ్‌డీఐ పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రమంతటా స్త్రీ, పురుష హెచ్‌డీఐ విలువలో వ్యత్యాసాలు తగ్గాయి. ఆదాయం, విద్య, ఆరోగ్య అంశాల్లో సాధించిన వృద్ధి వల్లే హెచ్‌డీఐలో లింగ వ్యత్యాసాలు తగ్గాయి. అయితే, స్త్రీ, పురుషుల మధ్య విద్యాభివృద్ధిలో వ్యత్యాసాలు అధికంగా ఉన్నాయి.
ప్రైవేటు విద్యకు..
ప్రైవేటు పాఠశాలలతో పోల్చితే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల విద్యా ఫలితాలు తక్కువగా ఉన్నాయి. పిల్లల విద్య పట్ల తల్లిదండ్రుల ఆకాంక్షాలు పెరిగాయి. నిరక్షరాస్య తల్లులు కూడా తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. అయితే, ప్రైవేటు స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీలు, ఇతర పేద వర్గాల విద్యార్థులు, అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ. పాఠశాల విద్య విషయంలో లింగ, కుల, తరగతుల మధ్య అగాధాన్ని ఆదాయ వ్యత్యాసాలు తీవ్రంగా పెంచేశాయి.