15 మంది సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టిన నటుడు సుబ్బరాజు
- డ్రగ్స్ వాడేవారిలో ప్రముఖ నిర్మాత ఇద్దరు తనయులు!
- హీరోలు, హీరోయిన్లు, వారి సంబంధీకులు సహా మరో 13 మంది కూడా..
- పబ్బులు కేంద్రంగానే విచ్చలవిడిగా డ్రగ్స్ దందా
- తాను మాత్రం డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడి
- సుబ్బరాజును 13 గంటల పాటు విచారించిన ఎక్సైజ్ సిట్
- ఆ 15 మందికి నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తవ్వుతున్న కొద్దీ డ్రగ్స్ వ్యవహారంలో సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో కీలకంగా వ్యవహరించే ఓ కుటుంబానికి చెందిన నిర్మాత ఇద్దరు తనయులు డ్రగ్స్ వినియోగిస్తారని నటుడు సుబ్బరాజు ఎక్సైజ్ సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. వారితోపాటు మరికొందరు నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, వారి సంబంధీకులు విచ్చలవిడిగా డ్రగ్స్ వాడతారని చెప్పినట్లు సమాచారం. మొత్తంగా సినీ పరిశ్రమకు చెందిన దాదాపు 15 మంది పేర్లను సుబ్బరాజు వెల్లడించినట్లు తెలిసింది. ఈ డ్రగ్స్ దందా అంతా కూడా పబ్బులు కేంద్రంగా జరుగుతోందని బయటపెట్టినట్లు సమాచారం. తాను మాత్రం డ్రగ్స్ వినియోగించనని చెప్పినట్లు తెలుస్తోంది.
లంచ్ వరకు.. ‘ఏమీ తెలియదు’!
ఎక్సైజ్ సిట్ మూడో రోజు విచారణలో భాగంగా సినీ నటుడు సుబ్బరాజు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చారు. ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభించిన అధికారులు సుబ్బరాజుపై వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ మధ్యాహ్నం 1.15 గంటల వరకు కూడా సుబ్బరాజు ఏమాత్రం సమాధానాలు చెప్పలేదని తెలిసింది. ఆయన భోజనం కూడా చేయలేదని సమాచారం. దాంతో మధ్యాహ్న భోజన సమయం తర్వాత సిట్ అధికారులు ప్రశ్నల తీరు మార్చి.. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఉన్న సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. ‘పూరితో కలసి డ్రగ్స్ తీసుకున్నారా?.. ముమైత్‌ఖాన్, చార్మి తదితరులతో కలసి తరచూ చేసుకున్న పార్టీల్లో డ్రగ్స్ వినియోగించినట్టు ఆరోపణలున్నాయి.. వీటిపై మీ సమాధానం ఏమిటి..’అంటూ గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది.
అయితే ఈ ప్రశ్నలకు కూడా సుబ్బరాజు తనకేమీ తెలియదని, అల్లోపతి మందులే తీసుకోని తనకు డ్రగ్స్ అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో సిట్ అధికారులు సుబ్బరాజు కెల్విన్‌తో కలసి దిగిన ఫొటోలు చూపించారని.. ‘అతడితో పరిచయం ఎందుకు? ఎవరు చేశారు? పూరి జగన్నాథ్ పరిచయం చేశారా? మరెవరితోనైనా కలిశారా..’అని ప్రశ్నలు గుప్పించారని తెలుస్తోంది. ఆ ఫొటోలపై స్పందించిన సుబ్బరాజు... కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కావడంతో రెండు మూడు సార్లు పబ్బుల్లో కలిశానని, అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడేవాడని చెప్పినట్లు సమాచారం. అంతకు మించి తనతో కలిసింది లేదని, డ్రగ్స్ తీసుకున్నది లేదని పేర్కొన్నట్టు తెలిసింది.
సాయంత్రానికి మారిన సీన్..
సిట్ విచారణలో సాయంత్రానికి పరిస్థితి వేడెక్కినట్టు తెలిసింది. అధికారులు పలు ఆధారాలు చూపుతూ, గట్టిగా ప్రశ్నించడంతో... చివరికి సుబ్బరాజు తరచూ డ్రగ్స్ తీసుకునే కొందరి పేర్లు వెల్లడించినట్టు తెలిసింది. తెలుగు సినీ పరిశ్రమలో కీలకంగా ఉన్న ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన నిర్మాత ఇద్దరు తనయులు డ్రగ్స్ తీసుకుంటారని బయటపెట్టినట్లు సమాచారం. వారు మాత్రమే కాకుండా మరికొందరు నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, వారి సంబంధీకులు కలిపి మరో 13 మంది కూడా డ్రగ్స్ విపరీతంగా వినియోగిస్తారని సుబ్బరాజు వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిసింది. ఇక డ్రగ్ దందాకు వేదికగా మారిన మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని పలు పబ్బుల పేర్లను కూడా సుబ్బరాజు బయటపెట్టినట్టుగా సిట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మొత్తంగా ‘పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకుంటారా? ఆయనే మీకు డ్రగ్ సరఫరా చేస్తారా..’అన్న విషయంపై తిరిగి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం సుబ్బరాజు వాంగ్మూ లాన్ని రికార్డు చేసుకున్న అధికారులు... ఉస్మానియా వైద్య బృందంలో ఆధ్వర్యంలో రక్తం శాంపిల్స్, గోర్లు, వెంట్రుకలను పరీక్ష నిమిత్తం తీసుకున్నట్టు తెలిసింది.
నలుగురు విద్యార్థులకు కౌన్సెలింగ్!
డ్రగ్స్‌కు బానిసైన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్సైజ్ సిట్ అధికారులు శుక్రవారం కౌన్సెలింగ్ చేసినట్లు తెలిసింది. వారిలో ఓ ఐఏఎస్ అధికారి తనయుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
13 గంటల పాటు విచారణ
సాధారణంగా సాయంత్రం 5 గంటల వరకే విచారణ ముగుస్తుందని భావించగా.. సుబ్బరాజు సరైన రీతిలో సమాధానాలు చెప్పకపోవడంతో మరింత సేపు విచారణ కొనసాగించాలని అకున్ సబర్వాల్ నిర్ణయించారు. దాంతో రాత్రి 11.10 గంటల వరకు సుబ్బరాజును ప్రశ్నించారు. అంటే సిట్ వర్గాలు సుబ్బరాజును దాదాపు 13 గంటల పాటు విచారించాయి. తొలిరోజున దర్శకుడు పూరి జగన్నాథ్‌ను 10 గంటలు, రెండో రోజున కెమెరామన్ శ్యాం కే నాయుడును 6 గంటలు విచారించిన సంగతి తెలిసిందే.
ఇక పబ్బులపై పంజా!
హైదరాబాద్‌లోని పబ్బుల ద్వారానే డ్రగ్స్ దందా విస్తరిస్తోందని ఎక్సైజ్ సిట్ గుర్తించింది. ఈ మేరకు పబ్బుల నిర్వాహకులను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్నవారు వెల్లడించిన సమాచారం ప్రకారం.. పబ్బుల్లోనే డ్రగ్ కల్చర్ నడుస్తున్నట్టు బయటపడిందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని 17 పబ్బుల నిర్వాహకులను విచారణకు పిలిచామని.. శనివారం ఉదయం 11 గంటలకు వారు ఎౖMð్సజ్ సిట్ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇక సినీనటి ముమైత్‌ఖాన్ కూడా నోటీసులు స్వీకరించారని.. ఆమె ఈ నెల 27న విచారణకు హాజరవుతారని చెప్పారు.
నేడు హీరో తరుణ్ విచారణ
సిట్ దర్యాప్తులో భాగంగా నాలుగో రోజు శనివారం సినీ హీరో తరుణ్ విచారణకు హాజరవుతారని అకున్ సబర్వాల్ తెలిపారు. సిట్ విచారణకు అందరూ సహకరిస్తే త్వరగా దర్యాప్తు ముగుస్తుందని పేర్కొన్నారు.
ఎంతటివారున్నా వదలం
డ్రగ్స్ వ్యవహారంలో ప్రస్తుతం విచా రణ ఎదుర్కొంటున్న వారేకాకుం డా.. దర్యాప్తులో వెల్లడవుతున్న మిగతా సినీ ప్రముఖులను కూడా విచారిస్తా మని ఎక్సైజ్ సిట్ చీఫ్ అకున్ సబర్వాల్ తెలిపారు. సిట్ విచారణ తీరుపై వస్తున్న ఆరోపణల ను ఖండించారు. తాము చట్టప్రకారంగానే అన్ని ఆధారాలతో ముందుకెళుతున్నా మని.. తమ బృందంలో మంచి దర్యాప్తు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు ఎదు ర్కొంటున్న మిగతా వారిని సైతం త్వరలోనే విచారిస్తామన్నారు. ఇక సుబ్బరాజు విచారణలో పలు కీలకమై న అంశాలు వెలుగులోకి వచ్చాయని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. సుబ్బరాజు చెప్పిన అంశాల ఆధారం గా మిగతా వారిని విచారించాలని సిట్ భావిస్తోందని.. కేసు దర్యాప్తులో సిట్ బృందాలు కొత్త కోణాన్ని అన్వేషిస్తున్నా యని చెప్పారు. ఈ కేసులో తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని, డ్రగ్స్‌ను నియంత్రించాలన్నదే ఎక్సైజ్ శాఖ ఉద్దేశమని పేర్కొన్నారు.
– అకున్ సబర్వాల్
అన్ని సమాధానాలూ చెప్పా
‘‘నాకు వారం కింద నోటీసులు వచ్చాయి. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరమైతే మళ్లీ విచారణకు రావడానికి సిద్ధం. కేసు విచారణ చాలా సీరియస్‌గా జరుగుతోంది. దీనిని నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు కావడం బాధాకరం. ఇది చాలా తీవ్రమైన సమస్య. డ్రగ్స్‌ను నియంత్రించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది..’’
– నటుడు సుబ్బరాజు