బడుగుల బాంధవుడు కొండా లక్ష్మణ్ | Swamy Goud Comments on Konda Laxman | Sakshi
Sakshi News home page

బడుగుల బాంధవుడు కొండా లక్ష్మణ్

Published Wed, Sep 28 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

బడుగుల బాంధవుడు కొండా లక్ష్మణ్

బడుగుల బాంధవుడు కొండా లక్ష్మణ్

సాక్షి, హైదరాబాద్: బలహీనవర్గాలు సామాజికంగా ఎదిగేందుకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతగానో కృషి చేశారని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. సహకార సంఘాలను, కుల వృత్తులను ప్రోత్సహించిన బాపూజీ బడుగు వర్గాల బాంధవుడని కొని యాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని, 90 ఏళ్ల వయసులోనూ తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారన్నారు. మంగళవారమిక్కడ ఆర్టీసీ కళాభవన్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీలు కేశవరావు, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రాపోలు ఆనందబాస్కర్ పాల్గొన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిషన్‌ను ఏర్పాటు చేసి, సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంచార జాతులను గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వారిని అభివృద్ధి పరచాలన్నారు.

బీసీ సాధికారిత భవనాన్ని నిర్మించి అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాన్ని నిర్వహించాలని, అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నిజాం పాలనలో మొదటిసారి ఆబిడ్‌‌సలోని హెడ్ పోస్టాఫీసుపై జాతీయ జెండా ఎగురవేసిన గొప్ప ధీశాలి బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నారన్నారు.
 
ఆ పోరాట పటిమ అందరిలో రావాలి
స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు లక్ష్మణ్ బాపూజీ  చూపిన పోరాట పటిమ అందరిలోనూ రావాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని బలహీనవర్గాలు అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. బాపూజీ విగ్రహాన్ని తప్పకుండా ఏర్పాటు చేయాలని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తాను, బాపూజీ ఒక కుటుంబ సభ్యులుగా మెలిగామని ఎంపీ కేశవరావు గుర్తుచేసుకున్నారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేదల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి బాపూజీ అని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.

బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ది సాధ్యమని, 50 శాతం ఉన్న బీసీలకు, విద్య, రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని బాపూజీ జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ , మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. బీసీలకు సబ్ ప్లాన్ పై ప్రభుత్వం చర్చ జరుపుతోందన్నారు. బీసీలకు ఉపకార వేతనాలను పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. జలదృశ్యంలో బాపూజీ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానన్నారు. నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆర్.కృష్ణయ్య కొనియాడారు.

కొద్దిగా రాజీపడ్డా ఆయన సీఎం అయ్యేవారని అన్నారు. కార్యక్రమంలో సామాజిక దర్శిని పుస్తకం, బాపూజీ పాటల సీడీ, బీసీ మీడియా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ, కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఉత్సవ సమితి వైస్ చైర్మన్లు యాదగరి, కాల్లప్ప, మల్లయ్య, వెంకటేశ్వర్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement