జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్
కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారు
నోటా బటన్, ఈవీఎంలకు ప్రింటింగ్
మిషన్‌లు ఎందుకు ఏర్పాటు చేయలేదు
ఎన్నికల అవకతవకలపై ఈసీ దృష్టికి తీసుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయని కాంగ్రెస్ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రావణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లడంతో పాటు న్యాయస్థానాల్లోనూ ఫిర్యాదు చేస్తామన్నారు.
గాంధీభవన్‌లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డితో కలసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఎన్నికల నిఘా సంస్థ నేత వీవీ రావ్ రుజువు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఓటింగ్ యంత్రాలకు ప్రింటింగ్ మిషన్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే బిహార్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్‌లను అమర్చారు’ అని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రిటింగ్ మిషన్‌లను ఎందుకు అమర్చలేదని, అలాగే ఈవీఎంలలో నోటా బటన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో ఎన్నికల ప్రధానాధికారి, సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు తెలుస్తోందని ఆరోపించారు. 2010 ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పెట్టాలంటూ టీఆర్‌ఎస్ నేత ఎస్.నిరంజన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అప్పట్లో ఈసీ సమర్థించకపోతే ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చేత నామినేషన్ దాఖలు చేయించారని శ్రావణ్ చెప్పారు.
జాంబాగ్‌లో తమ పార్టీ అభ్యర్థి విక్రమ్‌గౌడ్ కుటుంబ సభ్యుల ఓట్లు ఒక పోలింగ్‌బూత్ పరిధిలో 125 ఓట్లు ఉంటే కేవలం 20 ఓట్లు మాత్రమే పోలయ్యాయన్నారు. 142వ డివిజన్ అడ్డగుట్టలో ఒక పోలింగ్ కేంద్రంలో 556 ఓట్లు పోలైతే... లెక్కింపులో 992 ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ట్యాంపరింగ్ జరిగిందనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలన్నారు.
ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు, తమ మిత్రపక్షం ఎంఐఎంకు 45 సీట్లు వస్తాయని కచ్చితంగా ఎలా చెప్పగలిగారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ సోమవారం గాంధీభవన్‌కు రావాలని కోరారు. డివిజన్ వారీగా పోలైన ఓట్లపై సమీక్ష జరిపి తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని శ్రావణ్ చెప్పారు.