సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతులకు టెక్నాలజీ లాభాలు అందాలన్న లక్ష్యంతో మెట్టపంటల వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), మైక్రోసాఫ్ట్, టీ-హబ్‌లు హైదరాబాద్‌లో రెండురోజుల పాటు హ్యాకథాన్ నిర్వహించాయి. రైతు సమస్యలకు టెక్నాలజీతో పరిష్కార మార్గాలను చూపే లక్ష్యంతో నిర్వహించిన ‘హ్యాక్4ఫార్మర్స్’లో ‘డిజిటల్ అగ్రి, రూరల్ ఈ-మార్కెటింగ్’ (డేర్-ఈ) యాప్ విజేతగా నిలిచింది. వివిధ మార్కెట్లలో ధరలు, కొనుగోలుదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించే ఈ యాప్‌ను ఇక్రిశాట్, మైక్రోసాఫ్ట్ శాస్త్రవేత్తలు, టెక్నాలజిస్టులు రూపొందించారు.
ఇక్రిశాట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అనిల్ భన్సాలీ, ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్ బెర్గ్‌విన్సన్, టీ-హబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమా అయ్యర్ హ్యాకథాన్ వివరాలను వెల్లడించారు. డేర్-ఈ బృందం ఆలోచనను ఒక ఉత్పత్తి/సేవగా రూపాంతరం చెందేందుకు టీ-హబ్ సహకరిస్తుందని రమా అయ్యర్ తెలిపారు. అన్నిరంగాలను ప్రభావితం చేస్తున్న టెక్నాలజీ సామర్థ్యాన్ని రైతులకూ అందించే లక్ష్యంతో హ్యాకథాన్ నిర్వహణకు ఇక్రిశాట్ ముందుకొచ్చిందని సంస్థ డెరైక్టర్ జనరల్ బెర్గ్‌విన్సన్ తెలిపారు. హ్యాకథాన్‌లో మొత్తం 11 బృందాలు పొల్గొన్నాయి.