తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన కేబినెట్ సమావేశం సచివాలయంలో శనివారం ఉదయం ప్రారంభమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన కేబినెట్ సమావేశం సచివాలయంలో శనివారం ఉదయం ప్రారంభమైంది. మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతుండటంతో దీనికి భారీ ఎజెండా సిద్ధం చేశారు. కొత్త సంవత్సరంలో తొలి భేటీ కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. రెండు మూడు రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు జారీ కానుండటంతో పీఠాన్ని చేజిక్కించుకోడానికి ఏం చేయాలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశానికి సీనియర్ నేత కేకేను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు మరికొన్ని రాయితీలను, తాయిలాలను ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త బడ్జెట్ గురించి కూడా చర్చించబోతున్నారు. మధ్యాహ్నం సీనియర్ అధికారులకు ఓ ప్రైవేటు హోటల్లో విందు ఏర్పాటుచేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. మిషన్ కాకతీయ, భగీరథలకు తోడు ఈ సంవత్సరం నుంచి సాగునీటి ప్రాజెక్టులకు ఏటా రూ. 25వేల కోట్లు కేటాయించాలని సర్కారు భావిస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల పోస్టుల భర్తీకి ఆమోదం లభించాల్సి ఉంది. అన్ని శాఖలకు సంబంధించిన విషయాలను చర్చించి, అన్ని వర్గాలను దగ్గరకు చేర్చుకోడానికి కావల్సిన పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.