
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా ఫిలిప్ సి థోచర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన సభలో ఆంగ్లో ఇండియన్ కోటా కింద ఎమ్మెల్యేగా ఫిలిప్ సీ థోచర్‌ను గవర్నర్ నరసింహన్ నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు కన్నావారితోటకు చెందిన 65 ఏళ్ల ఫిలిప్ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్‌లో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గ్రాడ్యుయేషన్ చదివిన ఫిలిప్‌కు భార్య డయానా, కుమారుడు అశాధ్ అబ్రహాం, కుమార్తె ఎలీనా ఉన్నారు. టీడీపీలో 32 ఏళ్లుగా క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసినందుకుగాను తనకు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి వరించిందని ఫిలిప్ తెలిపారు.