
చీకటి రాజ్యం
ఇంటర్‌నెట్ మాఫియా విజృంభణ
డ్రగ్స్ విక్రయానికి {పత్యేక సర్వర్లు, బ్రౌజర్లు
డిజిటల్ కరెన్సీలోనే నగదు చెల్లింపులు
‘ఎల్‌ఎస్‌డీ గ్యాంగ్’ విచారణలో వెలుగులోకి
సిటీబ్యూరో: బాహ్య ప్రపంచంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ అథోజగత్తు ఉంది. మనకు తెలిసిన అండర్ వరల్డ్‌లో మాఫియా డాన్లు రాజ్యమేలితే... ఇంటర్‌నెట్‌లోని అండర్ గ్రౌండ్ వెబ్‌లో డ్రగ్స్ వ్యాపారం సాగుతుంటుంది. దీనికి సంబంధించిన నగదు లావాదేవీలు బిట్ కాయిన్స్‌గా పిలిచే డిజిటల్ కరెన్సీలోనే సాగుతుంటాయి. హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన నాగ్‌పూర్ ద్వయం విచారణలో ఈ కోణాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్డర్ పేరిట వల
సింథటిక్ డ్రగ్‌గా పిలిచే... బొమ్మల రూపంలో ఉండే ఎల్‌ఎస్‌డీ (లినర్జిక్ యాసిడ్ డై థైలామెడ్) మాదక ద్రవ్యం చేతులు మారుతోందనే సమాచారంతో దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ నెల 8న కింగ్‌కోఠి ప్రాంతంలో దాడి చేశారు. దీంతో ముస్తఫా మొయినుద్దీన్, జునైద్ రజా సిద్దిఖీ, మహ్మద్ మంజిల్ ముఖరం పాషా చిక్కారు. వీరికి ఎల్‌ఎస్‌డీని సరఫరా చేస్తున్నది నాగపూర్‌కు చెందిన అన్నదమ్ములు మయాంక్ కుమార్ సాహు, పీయూష్ కుమార్ సాహుగా గుర్తించారు. దీంతో ఆర్డర్ పేరుతో వలపన్నిన టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం లిబర్టీ ప్రాంతానికి రప్పించి అరెస్టు చేసింది. వీరికి మాదక ద్రవ్యాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే కోణంలో విచారించగా... ఆసక్తికరమైన ఆన్‌లైన్ అండర్ వరల్డ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.
‘నెట్టింట్లో’ మరో ప్రపంచం...
కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం... వివిధ చిరునామాలతో ఇంటర్‌నెట్‌లో ఉండే వెబ్‌సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ-కామర్స్ వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చి... అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో ‘తమ విని యోగదారులు’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మాదక ద్రవ్య ముఠాలు ఇంటర్‌నెట్‌లో అండర్ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్‌గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు.
టెయిల్స్ ఆపరేషన్ సిస్టంతో...
ఏ వినియోగదారుడైనా విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. అందులోని వెబ్‌సైట్లను చూడటం... యాక్సెస్ చేయడం కుదరదు. ఈ అథోజగత్తులో అడుగు పెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకున్న మయాంక్, పీయూష్‌లు వాటి ద్వారానే ‘న్యూక్లియస్ మార్కెట్ ప్లేస్’ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించారు. డ్రగ్స్ విక్రయంలో పేరున్న ఆ సైట్ ద్వారానే ఆర్డర్ ఇచ్చి, ఎల్‌ఎస్‌డీని నాగ్‌పూర్‌లో డెలివరీ చేయిం చుకున్నారు. కొరియర్ ద్వారా వచ్చే ఈ ‘మాల్’ను అందుకోవడానికి తప్పుడు చిరునామాలు ఇచ్చిన ఈ ద్వయం... నేరుగా కొరియర్ ఆఫీసులకు వె ళ్లి డెలివరీ తీసుకుంటూ తమ ఉనికి బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంది.
బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపులు
డీప్ వెబ్‌లోని వెబ్‌సైట్లలో ఆర్డర్ ఓ ఎత్తయితే... చెల్లింపులు మరోఎత్తు. ఈ లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే బిట్‌కాయిన్స్‌గా పిలిచే డిజిటల్ కరెన్సీ రూపంలో సాగుతాయి. దీనికీ కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాటిలోకి లాగిన్ కావడం ద్వారా ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించి బిట్ కాయిన్స్‌ను తమ ఖాతాలోకి జమ చేసుకుంటారు. ‘డీప్ వెబ్’లో కొనుగోలు చేసిన ‘మాల్’కు చెల్లింపులన్నీ ఈ బిట్ కాయిన్స్ రూపంలోనే చేస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా విక్రయిస్తున్న, ఖరీదు చేస్తున్న వ్యక్తుల వివరాలు వేరొకరికే కాదు... ఒకరికొకరికీ తెలిసే అవకాశం ఉండదు. మయాంక్, పీయూష్‌లు ఈ రకంగానే ఎల్‌ఎస్‌డీని ఖరీదు చేసి నగరంలోని వారికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది.
సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే
సాధారణ వెబ్‌సైట్లతో పాటు సోషల్ మీడి యా పని చేయడానికి వాటిని ఇంటర్‌నెట్‌లో ఏదో ఒక సర్వర్ హోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆరా తీయాల్సి వచ్చినప్పుడు పోలీసు, నిఘా వర్గాలు ఈ సర్వర్ అడ్రస్ ఏమిటి? అది ఎక్కడ ఉంది? నిర్వహిస్తున్నది ఎవరు? తదితరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘డీప్ వెబ్’ సర్వర్లు, చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే అసాంఘిక శక్తులకు కలిసి వస్తోంది. ఈ తరహా కేసులు గతంలో బెం గళూరులో వెలుగులోకి వచ్చినా.. తెలుగు రాష్ట్రాల్లో బయట పడడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. నాగ్‌పూర్ ద్వయం మాత్రం తమకు ఎల్‌ఎస్‌డీ డ్రగ్ చైనా, దుబాయ్‌ల నుంచి వచ్చినట్లు వెల్లడించారని... ఇది కూడా నిర్థారించడం కష్టమని ఓ అధికారి తెలిపారు.