ఉద్యోగం పేరుతో అంధుడికి టోకరా
జీడిమెట్ల, న్యూస్‌లైన్: ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కన్సల్టెన్సీలను మనం చూశాం... అయితే, ఉద్యోగం పేరుతో ఓ అంధుడినీ మోసం చేశారు కొందరు ఘనులు. న్యాయం చేయమని బాధితుడు ఐదు రోజుల క్రితం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయిస్తే ఇదిగో.. అదిగో.. అంటూ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. దీంతో బాధితుడు ఆదివారం ‘న్యూస్‌లైన్’ ను ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. బాధితుడి కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కమలానగర్‌కు చెందిన శేఖర్, సుబ్బలక్ష్మిల కుమారుడు లక్ష్మణ్ (18) పుట్టుకతోనే అంధుడు.
అనంతపురంలోని ఆర్‌డీటీ అంధుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం బళ్లారికి వెళ్లగా, ఇతను స్వగ్రామంలో నానమ్మతో కలిసి ఉంటున్నాడు. చిత్తు కాగితాలు ఏరి నానమ్మ పోషిస్తుండటంతో తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసి నాన్నమ్మకు ఆసరాగా ఉంటానని స్నేహితులకు చెప్పాడు. ‘చాక్లెట్ కంపెనీలో ఉద్యోగం, 18 వేల జీతం, భోజన వసతి కూడా కల్పిస్తాం’ అంటూ ఈనెల 10న ఓ పత్రికలో వచ్చిన ప్రకటను చూసి స్నేహితులు లక్ష్మణ్‌కు తెలిపారు.
ప్రకటనలో ఉన్న నెంబర్‌కు లక్ష్మణ్ ఫోన్ చేసి.. ‘నేను అంధుడిని.. ఉద్యోగం ఇస్తారా?’ అని అడిగాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి ‘మీలాంటి వారికి కూడా ఉద్యోగాలున్నాయి. రూ.1000 కన్సల్టేషన్ ఫీజు నిమిత్తం ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ (నెం 044410100074130)లో జమ చేసి.. తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చి కలవండి’ అని చెప్పాడు. డబ్బు చెల్లించిన లక్ష్మణ్.. 15న నాంపల్లికి వచ్చి ఫోన్ చేయగా మరుసటి రోజు రమ్మని చెప్పారు. 16న సికింద్రాబాద్.. ఆపై జీడిమెట్లకు రమ్మని చెప్పారు.
చివరకు కన్సల్టెన్సీ ఆఫీస్‌కు వెళ్లగా నువ్వు అంధుడివి నీకు ఉద్యోగం లేదని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన లక్ష్మణ్ స్థానికుల సహాయంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సొంత ఊరుకు వెళ్లలేక ఐదు రోజులుగా తనకు న్యాయం చేయండంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తూ.. రాత్రి ఎక్కడో ఒక చోట తలదాచుకుంటున్నాడు. పోలీసుల తీరుతో విసుగు చెందిన బాధితుడు ఆదివారం ఉదయం ‘న్యూస్‌లైన్’ను ఆశ్రయించి తన గోడు చెప్పుకున్నాడు. పోలీసులు ఇతనికి న్యాయం చేస్తారని ఆశిద్దాం.