
చెదిరిన పచ్చబొట్టు... గాలివేటు...
ఈదురుగాలులతో చెట్లకు చేటు
నగరంలో ఇటీవల కుప్పకూలిన మూడువేల వృక్షాలు పర్యావరణానికి ముప్పు
నేలకూలిన చెట్లలో 90 శాతం కొండ తంగేడు రకానివే..
నేల స్వభావాన్ని బట్టి చెట్లు పెంచాలంటున్న నిపుణులు
సిటీబ్యూరో: చిన్నపాటి గాలి దుమారానికే గ్రేటర్‌లో భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. కొద్దిరోజులుగా నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో వీస్తోన్న ఈదురుగాలులకు మహానగరం పరిధిలో వేలకొలది చెట్లు కుప్పకూలడంతో..ఉన్న కొద్దిపాటి హరితం కనుమరుగవుతోంది. 625 చదరపు కిలోమీటర్లు విస్తరించిన మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 30 శాతం గ్రీన్‌బెల్ట్ (హరిత వాతావరణం) ఉండాల్సి ఉండగా... కేవలం 8 శాతమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే తరుణంలోపులిమీద పుట్రలా ఉన్న చెట్లు కూడా ఇటీవలి ఈదురుగాలులకు నేలమట్టం అవుతుండడం సర్వత్రా కలచివేస్తోంది. జీవవైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణకు బాసటగా నిలవడంతోపాటు...నగరంలోని రాతి నేల స్వభావానికి అనుగుణంగా పెరిగేవి, బలమైన వేరు, కాండం వ్యవస్థ ఉన్న చెట్లు కాకుండా.. గతంలో అందం..ఆకర్షణ, పైపై సొబగుల కోసం పెంచిన అలంకరణ వృక్షాలే ఇటీవల కుప్పకూలినట్లుశాస్త్రవేత్తలు చెబుతుండడం గమనార్హం.
చెట్లు ఎందుకు కుప్పకూలుతున్నాయంటే..
నగరంలో ఇటీవల భారీగా వీచిన ఈదురుగాలులు, జడివానలకు భారీ సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. సుమారు మూడు వేల వరకు వృక్షాలు నేలకొరిగినట్లు అంచనా. కూలిన చెట్లలో 90 శాతం వరకు కొండ తంగేడు(పెల్టోఫామ్) జాతికి చెందినవి. మిగతా వాటిల్లో వేప, రావి, కానుగ, పొగడ తదితరమైనవి ఉన్నాయి. చెట్ల వేర్లకు అడుగు దూరం మేర ఎలాంటి నిర్మాణాలు చేయరాదు. కానీ నగరంలో చెట్ల వేర్లను ఆనుకునే రోడ్లు వేశారు. దాంతో వేర్లు అభివృద్ధి చెందలేదు. తత్ఫలితంగా చెట్టు బలంగా నిలబడలేక చిన్నపాటి దుమారానికే కొమ్మలు విరిగిపడి కాండం నేలకొరుగుతోంది. చెట్ల మధ్య దూరం పది మీటర్ల మేర ఉండాల్సి ఉండగా, ఎక్కడా ఆ నియమం పాటించిన దాఖలాలు లేవు.
చెట్టు పైభాగం (క్రౌన్) గాలి వాలుకనుగుణంగా ఎటు వైపైనా తిరగ గలిగినంత ఖాళీ ప్రదేశం ఉండాలి. కానీ నగరంలో ఎక్కడా ఆ పరిస్థితి లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. {sీ ట్రైనింగ్ అండ్ ట్రిమ్మింగ్‌ను కూడా పట్టించుకోలేదని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంటే చెట్ల కొమ్మల్ని నిర్ణీత కాలవ్యవధుల్లో కత్తిరించాలి. కానీ ఇష్టానుసారంగా తొలగిస్తున్నారు. విద్యుత్ తీగలు ఉన్న వైపు మాత్రమే కత్తిరిస్తుండడంతో ఒక వైపే కొమ్మల భారం పెరిగి ఈదురుగాలులకు విరిగిపడుతున్నాయి. ఇటీవలి కాలంలో నగరంలో కనివినీ ఎరగని రీతిలో బలమైన గాలులు వీయడం కూడా ఎక్కువ చెట్లు నేలకొరగడానికి కారణమని చెబుతున్నారు.
కానుగ, రావి, మద్ది వంటి చెట్లు పెరిగేందుకు దాదాపు 15 సంవత్సరాలు పడుతుందన్న ఉద్దేశంతో 1998-2004 మధ్య కాలంలో అందం,ఆకర్షణ, అలంకరణ కోసమంటూ పెద్దఎత్తున కొండ తంగేడు రకానికి చెందిన మొక్కలు నాటారు. ఇవి ఆరేడు సంవత్సరాల్లోనే పెరుగుతాయన్న ఉద్దేశంతో వీటికే ప్రాధాన్యతనిచ్చారు. ఇవి ఇటీవల కుప్పకూలుతున్నాయి. నగరంలో జీవితకాలం అధికంగా ఉండేవి, రాతినేల స్వభావానికి అనుగుణంగా ఉన్న చెట్లు పెంచితే అవి ఈదురుగాలులకు చెక్కు చెదరకుండా ఉంటాయని వృక్షశాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తొలగించాల్సిన చెట్ల రకాలివే....
పార్కు చుట్టూ ఉన్న చెట్లలో సైకస్, మహాఘని, చాంపియన్‌పామ్, బాటిల్‌బ్రష్, బహున్ల, నెమలినార, రావి, తెల్లమద్ది, బిగ్నీనియా, ఉల్లింత, రేల తదితరమైనవి ఉన్నాయి.
హరితహారంలో 25 లక్షల చెట్లు నాటడమే లక్ష్యం..!
నగరంలో భారీగా చెట్లు నేలకొరగడం, హరితం కనుమరుగవుతుండడంతో ప్రభుత్వం ఆలస్యంగా కళ్లు తెరిచింది. రాబోయే వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ పరిధిలో 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఇందులో 50 ఏళ్లకు పైగా జీవితకాలం ఉన్నవే అధికంగా ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నాటబోయే చెట్లలో రావి, కానుగ, బాదాం,నేరుడు, పొన్న, వేప, సిల్వర్ ఓక్, అశోక, మిల్లింగ్ టోనియా, స్పాథోడియా, పగోడా, టెకోమా అర్జెంటియా, బహునియా పుర్పూరియా, టెకోమా గౌడిచౌడి, కదంబ, మహాగణి, టబేబియా, టబేబియా రోజియా, టెర్మినేలియా అర్జున, బర్రింగ్‌టోనియా, అల్‌స్టోనియా, చంపక, పెల్టోపోరం, రాయల్‌పామ్, గుల్‌మోహర్, కేసియా ఫిస్టులా, చిన్నబాదం, బాదాం, పనాస, పొన్న రకాలున్నాయి.
పలు మెట్రో నగరాల్లో హరిత తోరణం ఇలా..
హైదరాబాద్ నగర పాలక సంస్థ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఇందులో సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ ఉందని జీహెచ్‌ఎంసీ లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం విస్తీర్ణంలో సుమారు 8 శాతమే హరిత వాతావరణం ఉందన్నమాట. ఇక మన పొరుగునే ఉన్న బెంగళూరు మహానగరంలో 13 శాతం (97 చదరపు కిలోమీటర్ల) మేర గ్రీన్‌బెల్ట్ ఉండడం విశేషం. దేశంలో ప్రణాళికా నగరంగా పేరొందిన ఛండీగడ్ నగర విస్తీర్ణం 114 చదరపు కిలోమీటర్లు కాగా..ఇందులో 30 శాతం భూమిలో హరిత తోరణం విస్తరించి ఉండడంతో ఈ నగరం హరితనగరం విషయంలో దేశంలోని అన్ని మెట్రోనగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 5.95 శాతం( 88.4 చదరపు కిలోమీటర్లు), చెన్నైలో 2.01 శాతం(24 చదరపు కిలోమీటర్లు), ముంబాయిలో 5.11 శాతం( 86 చదరపు కిలోమీటర్ల) విస్తీర్ణంలో హరితతోరణం ఉంది.