ఈసారి కూడా ఒకేసారి జంట పండుగలు | the two festivals at once | Sakshi
Sakshi News home page

ఈసారి కూడా ఒకేసారి జంట పండుగలు

Published Mon, Aug 22 2016 8:11 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

the two festivals at once

-గతేడాది లాగే ఈసారి కూడా వినాయక ఉత్సవాల్లో బక్రీద్
-ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తమవుతున్న అధికార యంత్రాంగం
-9వ వినాయక నిమజ్జనోత్సవాల రోజే బక్రీద్ పండుగ

చార్మినార్

 వచ్చే నెల ప్రారంభమయ్యే వినాయక ఉత్సవాల కోసం అటు ఉత్సవాల నిర్వాహకులు... ఇటు అధికారులు సిద్ధమవుతున్నారు. గతేడాది లాగే ఈసారి కూడా వినాయక ఉత్సవాలు కొనసాగుతుండగానే బక్రీద్ పండుగ వస్తుండటంతో సంబంధిత అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే అప్రమత్తమవుతుంది. ఇరువర్గాల ప్రజల పండుగలు ఒకేసారి కలిసి రానుండటంతో ఎక్కడ ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఎప్పటికప్పుడు తగిన విధంగా స్పందించడానికి జీహెచ్‌ఎంసీ, పోలీసులు, జలమండలి, విద్యుత్ విభాగాల అధికారులు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. 15 అడుగులకు పైగా భారీ విగ్రహాల ప్రతిష్టాపనకు అవకాశాలు లేవనే విషయాలను కూడా దక్షిణ మండలం పోలీసులు సంబంధిత ఉత్సవాల నిర్వాహకులకు స్పష్టం చేస్తున్నారు.


గతేడాది లాగే...
గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు 27వ తేదీన ముగియగా... మధ్యలో 9వ రోజు నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవం నాడే బక్రీద్ పండుగ వచ్చింది. దీంతో ముందే అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, దక్షిణ మండలం పోలీసులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పండుగలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఇరువర్గాల ప్రజలు సంబంధిత ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి కూడా సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు 15వ తేదీన నిమజ్జనోత్సవాలతో ముగియనున్నాయి. కాగా ఉత్సవాల మధ్యలో అంటే సెప్టెంబర్ 13వ తేదీన బక్రీద్ పండుగ ఉండటం... అదే రోజు 9వ రోజు వినాయక నిమజ్జనోత్సవాలుండటంతో ఈసారి కూడా ఇరువర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలకు శ్రీకారం చుడుతున్నారు.


వినాయక నిమజ్జనోత్సవ పనులు...: జోనల్ కమిషనర్.
వచ్చే నెల 5వ తేదీన ప్రారంభమై 15వ తేదీన ముగిసే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా త్వరలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నామని జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా బాలాపూర్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు ఉన్న ప్రధాన ఊరేగింపుతో పాటు అంతర్గత ఊరేగింపుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిమజ్జనోత్సవాల్లో ఒక శానిటరీ సూపర్‌వైజర్, ముగ్గురు శానిటరీ ఫిల్డ్ అసిస్టెంట్‌లతో పాటు వర్కర్లు ఉంటారన్నారు. ఒక వైపు వినాయక ఉత్సవాలు జరుగుతుండగానే... మరోవైపు బక్రీద్ పండుగ వస్తుండటంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తమ సిబ్బందితో పాటు జలమండలి, విద్యుత్, పోలీసు, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులతో కూడిన కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కమిటీ వచ్చే 5వ తేదీ నుంచి సర్ధార్ మహాల్‌లో నిర్వహించే కంట్రోల్ రూమ్‌లో అందుబాటులో ఉంటారన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో అధికంగా జంతువు కళేబరాలు (యానిమల్ వెస్టేజ్) పడే అవకాశాలున్నందున.. వాటన్నింటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.


జంట పండుగల సందర్భంగా గట్టి బందోబస్తు...: డీసీపీ.
గతేడాది లాగే ఈసారి కూడా వినాయక ఉత్సవాలతో పాటు బక్రీద్ పండుగలు వస్తుండటంతో పాతబస్తీలోని ఇరువర్గాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో కలిసి మెలసి ఉత్సవాలు నిర్వహించుకోవాలని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. వచ్చే నెల 13వ తేదీన పాతబస్తీలోని చాలా మంది ఉత్సవాల నిర్వాహకులు తమ విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తారని... అదే రోజు ముస్లింల పండుగైన బక్రీద్ ఉండటంతో ఎవరికి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు. మండపాలకు దగ్గరగా యానిమల్ వెస్టేజ్ ఉండకుండా కిందిస్థాయి పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే వినాయక నిమజ్జనోత్సవాలను పురస్కరించుకొని చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ తదితర అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌ల పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. ఉత్సవాల నిర్వాహకులకు పలు సూచనలు చేశామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement