
ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన వారికి న్యాయ సహాయం
- వారు అమాయకులు: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- మతతత్వ అజెండాతోనే ముస్లింలపై వేధింపులు
- ముస్లిం యువత డబ్బు, ప్రలోభాలకు లొంగొద్దు
- దేశానికి సేవ చేసేందుకు వారు ముందుకు రావాలి
- ఐసిస్ అనేది సైతాన్ అక్రమ సంతానమని వ్యాఖ్య
హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసిన యువకులు అమాయకులని, వారికి తమ పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి టోలిచౌకి మహ్మది లై న్స్‌లోని మహ్మదీయ జామా మసీదులో జరిగిన షబే ఖదర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ.. గతంలో కూడా ఎందరో హైదరాబాద్ ముస్లిం యువకులను పోలీసులు అక్రమ కేసుల్లో ఇరికించారని, అయితే అల్లా దయ వల్ల వారిని కోర్టులు నిర్దోషులుగా ప్రకటించాయని చెప్పారు.
ఈసారి కూడా పోలీసులకు పట్టుబడ్డ యువకులు నిర్దోషులని తాము నమ్ముతున్నామని, గత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయ సహా యం అందించేందుకు నిర్ణయించామని తెలిపారు. కేం ద్రం మతతత్వ అజెండాను అమలుపరుస్తోందని, ఇందులో భాగంగానే ముస్లింలను వేధిస్తున్నారని ఆరోపించారు. బీఫ్ పేరిట పాలక పార్టీ నాయకులు, పోలీసులు ముస్లిం యువకులను వేధిస్తున్నారని, హరియాణాలో బీఫ్ రవాణా చేస్తున్నారని ఇద్దరు ముస్లిం యువకులను పోలీసులు అక్రమ కేసులో అరెస్ట్ చేసి చితకబాదారని చెప్పారు. ఐసిస్ అనేది సైతాన్ అక్రమ సంతానమని అసద్ వ్యాఖ్యానించారు.
ఐసిస్ ఉచ్చులో చిక్కుకుని కొందరు విధ్వంసం సృష్టిస్తున్నారని, రక్తపాతం అనేది ఇస్లాంలో లేదన్న విషయం ఖురాన్‌లో స్పష్టంగా ఉందని చెప్పారు. ముస్లింల రక్షకుడు అల్లా ఒక్కడే అని, ముస్లిం యువకులు డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా దేశానికి సేవ చేయాలని సూచించారు. చదువుకున్న ముస్లిం యువకులు వక్రమార్గాల వైపు పయనించకుండా పేద ముస్లింలకు సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, మసీద్ నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.