అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. ఏర్పాట్లపై సోమవారం స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించామన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘అవసరమైన స్థాయిలో ఇతర విభాగాలు, బయట జిల్లాల నుంచి బలగాలను మోహరిస్తున్నాం.
శాసనసభకు రెండు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ఆ ప్రాంతంలో సభలు, సమావేశాలు, ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’ అన్నారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై తన కార్యాలయంలో ఆయన మంగళవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అదనపు కమిషనర్ నుంచి అదనపు డీసీపీ స్థాయి అధికారుల వరకు పాల్గొన్నారు. మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో మధ్యాహ్నం బందోబస్తు ఏర్పాట్లపై రిహార్సల్స్ నిర్వహించారు. వీటిని పర్యవేక్షించిన డీసీపీ మార్పుచేర్పుల్ని సూచించారు. అసెంబ్లీ చుట్టపక్కల 10 ప్లటూన్లు (దాదాపు 300) మంది పోలీసులు విధుల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టూ ఉన్న మార్గాల్లో బారికేడ్లు, పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. శాసనసభ ప్రతి గేటుకు ఐపీఎస్ అధికారి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు. అధీకృత పాస్‌లున్న వారిని మినహా మరెవ్వరినీ అసెంబ్లీ పరిసరాల్లోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాల్ని మోహరిస్తున్నారు. ట్రాఫిక్ సర్వైలెన్స్ కెమెరాలు, ప్రత్యేక వాహనాలు, హ్యాండీక్యామ్‌లతో నిఘా ఉంచనున్నారు.
మోహరింపు ఇలా...
అదనపు ఎస్పీలు: ఆరుగురు
డీఎస్పీలు: 16 మంది
ఇన్‌స్పెక్టర్లు: 40 మంది
ఎస్సైలు: 80 మంది
హెడ్-కానిస్టేబుల్/కానిస్టేబుళ్లు: 450
ఏపీఎస్పీ ప్లటూన్లు: 26
అవసరమైన స్థాయిలో కేంద్ర పారామిలటరీ బలగాలు