* ప్రభుత్వాన్ని ఎండగడుతూ సాగునీటి
* ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో అబద్ధాలు, అవాస్తవాలను ఎండటట్టేందుకు టీపీసీసీ సిద్ధమైంది. ‘వాస్తవ జలదృశ్యం’ పేరిట పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఆవిష్కరించేందుకు సమాయత్తమైంది. హైదరాబాద్‌లో రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి దీన్ని వివరించనున్నారు.
సాగునీటి ప్రాజెక్టులు, వాటి రీ డిజైన్లకు సంబంధించి సీఎం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు దీటుగా జవాబివ్వడానికి దాదాపు మూడు నెలలుగా టీపీసీసీ ముఖ్యులు కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రచారం చేసుకుంటున్న కోటి ఎకరాల సాగులో అబద్ధాలు, వాస్తవ పరిస్థితులపై దృష్టిని కేంద్రీకరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందనే విషయాన్ని చెప్పనున్నారు.
వీటికి సంబంధించిన అన్ని గణాంకాలను ఈ వేదికగా ప్రజల ముందు పెట్టడానికి కసరత్తును పూర్తిచేసింది. 2004లో కాంగ్రెస్‌లో అధికారంలోకి వచ్చే నాటికే తెలంగాణలో నిజాంసాగర్,శ్రీరాంసాగర్, సింగూరు, నాగార్జునసాగర్ వంటి భారీ ప్రాజెక్టులు, ఇతర మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద మొత్తంగా సుమారు 50 లక్షల మేర ఆయకట్టు అందుబాటులో ఉందని పవర్‌పాయిట్ ప్రజెంటేషన్‌లో వివరించనున్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులు, వాటి కింద సాగులోకి వచ్చిన సాగుభూమి తదితర వివరాలను ఇందులో పొందుపరిచారు.
కమీషన్ల కోసమే రీ డిజైన్..
పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల రీ డిజైన్ కేవలం కమీషన్ల కోసమే అన్న వాదనను టీపీసీసీ వినిపించనుంది. రూ.38 వేల కోట్లు ఉన్న కాళేశ్వరాన్ని రూ.83 వేల కోట్లకు పెంచడం, రూ.10 వేల కోట్లతో వేసిన పాలమూరు అంచనాను రూ.48 వేల కోట్లకు పెంచడంపై నిలదీయనుంది. కాగా, ఈ పవర్‌పాయింట్ ప్రజేంటేషన్‌కు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఇతర ముఖ్యులను ఆహ్వానించారు. వీరితోపాటు జస్టిస్ చంద్రకుమార్, నైనాల గోవర్ధన్, గాదె ఇన్నయ్య, విమల, తెలంగాణ జర్నలిస్టు సంఘాలు, అన్ని పత్రికల ఎడిటర్లు, వివిధ రంగాల్లో ముఖ్యులను ఆహ్వానించారు. మూడున్నర గంటలపాటు ఈ కార్యక్రమం సాగనుంది.
నేడు టీపీసీసీ ‘వాస్తవ జలదృశ్యం’
Published Wed, Aug 17 2016 2:44 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
Advertisement
Advertisement