
కేసీఆర్ ప్రజెంటేషన్ తప్పులతడక
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ తప్పులతడకని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ బూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి, సాగునీటి వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ నేతలు దిగ్విజయ్ సింగ్, కుంతియా, టీకాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాలు నిగ్గుతేల్చేందుకే తాము ప్రజెంటేషన్ ఇస్తున్నామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రణాళికను రూపొందించింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, 52 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
'పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారు. ప్రాణహిత డిజైన్ మార్చి తెలంగాణ భవిష్యత్ను తాకట్టుపెట్టారు. జలం పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కాకిలెక్కలు చెప్పారు. కోటి ఎకరాలకు నీరు అందిస్తామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారు. లక్షా యాభైవేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి దోపిడీకి తెరతీశారు' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.