రెండు మూడ్రోజుల్లో రాష్ట్రపతి వద్దకు టీపీసీసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీపై దాడి జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, వారిపైనే ఎదురుకేసులు నమోదు చేయడంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని అంతర్గత విభేదాలను పక్కనబెట్టి ప్రభుత్వ తీరుపై ఐక్యంగా పోరాడకుంటే రాష్ట్రం టీఆర్‌ఎస్ రాజకీయ గుత్తాధిపత్యంలోకి పోతుందని పార్టీ ముఖ్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీ నేతలపై అధికార పార్టీ కక్షసాధింపు ధోరణికి పాల్పడుతోందని, దీన్ని నిరసిస్తూ పీసీసీ చీఫ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే బాగుంటుందని సూచిస్తున్నారు. పాతబస్తీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని అంటున్నారు. ఆమరణ నిరాహారదీక్ష చేయడం ద్వారా ప్రభుత్వ చర్యలను ఎండగడితేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని చెబుతున్నారు.
రాష్ట్రపతి వద్దకు...
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, సెక్షన్ 8ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీల నేతలను కాపాడాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు వెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. అఖిలపక్ష నేతలతో కలసి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.