శిక్షల కోసం..శిక్షణ! | Training for punishment! | Sakshi
Sakshi News home page

శిక్షల కోసం..శిక్షణ!

Published Mon, Apr 18 2016 12:17 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

శిక్షల కోసం..శిక్షణ! - Sakshi

శిక్షల కోసం..శిక్షణ!

‘రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసులకు ప్రాథమిక ఆధారం ..

ఇప్పటికే సీసీ కెమెరాలన్నీ ‘మ్యాప్ మీదికి’ ఫుటేజ్ సేకరణ, విశ్లేషణపై ప్రత్యేక శిక్షణ
న్యాయస్థానంలో దాఖలు విధానం పైనా విడతల వారీగా చేపడుతున్న అధికారులు

 

సిటీబ్యూరో: ‘రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసులకు ప్రాథమిక ఆధారం అందించింది సీసీ కెమెరా ఫీడ్. న్యాయస్థానంలో కీలక ఆధారంగా మారబోయేదీ అదే’  నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్న నగర పోలీసు విభాగం వీటిలో రికార్డు అయ్యే దృశ్యాలను బలమైన ఆధారాలుగా వాడుకోవాలని నిర్ణయించింది. ఓపక్క నేరగాళ్లను పట్టుకోవడంతో పాటు మరోపక్క వీరిని దోషులుగా నిరూపించడంలోనూ వినియోగించుకోనుంది. దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్‌ల సంగ్రహణ, విశ్లేషణ, ఆధారాలుగా రూపకల్పనలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం క్రైమ్ టీమ్స్‌కు నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్‌ను దశల వారీగా అందరికీ ఇవ్వాలని కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు.

 

కెమెరాలన్నీ క్రైమ్ మ్యాపింగ్‌లోకి...

నేరాల నియంత్రణ (ప్రివెన్షన్), కేసుల్ని కొలిక్కి తేవడం (డిటెక్షన్)కు ఉద్దేశించిన ప్రత్యేక యాప్ క్రైమ్ మ్యాపింగ్‌ను సిటీ పోలీసు ఐటీ సెల్ ఇప్పటికే రూపొందించింది. దీన్ని కమిషనరేట్‌లోని అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులోకి తెచ్చారు. సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. స్నాచింగ్, అటెన్షన్ డ్రైవర్షన్‌తో పాటు ఇతర నేరాలు చోటు చేసుకున్న సమయంలో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుంటారు. అయితే అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్‌కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం మానవ వనరుల్ని వినియోగించి మాన్యువల్‌గా వెతకాల్సి వస్తోంది. దీనికి కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్‌లో ‘క్రైమ్ రాడార్’ను ఏర్పాటు చేశారు. దర్యాప్తు అధికారులు దీనిలోకి ఎంటర్ అయితే చాలు... నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్‌అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది.

 

సేకరణ, విశ్లేషణ అత్యంత కీలకం...

ఘటనాస్థలికి సంబంధించి సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం ఒక ఎత్తై... వాటిలో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించడం, విశ్లేషించడం మరో ఎత్తు. వీటిలో ఏమాత్రం పొరపాటు జరిగినా కీలకాధారాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు దీనికోసం నిపుణులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆ అవసరం లేకుండా సిబ్బందికే ఈ అంశాలపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించిన కొత్వాల్ మహేందర్‌రెడ్డి ఆ విధానానికి శ్రీకారం చుట్టారు. సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయ్యే ఫీడ్ మొత్తం దానికి సంబంధించిన సర్వర్ లేదా హార్డ్‌డిస్క్‌లో సేవ్ అవుతుంది. వీటిని ఎలా నిర్వహించాలి? రికార్డు అయిన ఫీడ్‌ను ఏ రకంగా సంగ్రహించాలి? దర్యాప్తునకు అనుగుణంగా దాన్ని ఏ రకంగా విశ్లేషించాలి? తదితర అంశాలను నిపుణుల ద్వారా సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నారు.

 

కోర్టుల కోణంలోనూ కీలక తర్ఫీదు...

నేరం జరిగిన ప్రాంతంలో, సమీపంలో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం, వాటి ద్వారా రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించడం, దర్యాప్తు ద్వారా నిందితుల్ని పట్టుకోవడానికి విశ్లేషించడం... ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మరో కీలక ఘట్టం ఉంటుంది. ఆ సీసీ కెమెరాల ఫీడ్‌ను న్యాయస్థానంలో ఆధారంగా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగినప్పుడే నిందితుల్ని దోషులుగా నిరూపించే ఆస్కారం ఉంటుంది. ఇందులో పొరపాటు జరిగినా పోలీసుల శ్రమకు తగిన ఫలితం ఉండదు. దీంతో ఈ ట్రైనింగ్‌లో భాగంగా సిబ్బందికి నిబంధనలు, చట్ట ప్రకారం సీసీ కెమెరాల ఫీడ్‌ను ఏరకంగా న్యాయస్థానంలో దాఖలు చేయాలనేది నేర్పిస్తున్నారు. బృందాల వారీగా జరుగుతున్న ఈ శిక్షణ ప్రస్తుతం కమిషనరేట్‌లోని క్రైమ్ టీమ్స్‌కు ఇస్తున్నారు. వీరి తర్వాత శాంతిభద్రతల విభాగంలో పని చేస్తున్న సిబ్బందికీ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోనే ట్రైనింగ్ జరుగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement