
టీఆర్‌ఎస్‌లో పండుగ వాతావరణం
► కొత్త జిల్లాల్లో బహిరంగ సభలు
► జన సమీకరణపై నేతల దృష్టి
► కొత్త జిల్లాలతో నేతలకు
సంస్థాగత పదవులు
► భర్తీ కానున్న జిల్లా కార్యవర్గాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలతో అధికార టీఆర్‌ఎస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాల ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరపాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో ఆయా జిల్లాల పార్టీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రారంభ కార్యక్రమాలు ముగిశాక జరిగే బహిరంగ సభల నిర్వహణను పూర్తిగా పార్టీ నాయకత్వమే చూసుకుంటోంది. ఆ బహిరంగ సభలను విజయవం తం చేసేందుకు భారీగా జన సమీకరణ జరుపుతున్నా రు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొత్త జిల్లాల డిమాండ్, ప్రజల ఆకాంక్షలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరుస్తోందనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసేం దుకు బహిరంగ సభలను వినియోగించుకోవాలన్న వ్యూహంతో నేతలు ఉన్నారు. ఈ బహిరంగ సభలను పూర్తిగా పార్టీ కార్యక్రమాలుగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తిగా టీఆర్‌ఎస్ ఖాతాలో పడేలా ప్రచారం చేస్తున్నారు.
కొత్తగా సంస్థాగత పదవులు
రెండేళ్లుగా పెండింగ్ పడుతూ వచ్చిన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల భర్తీ ప్రక్రియకు కూడా దసరా సందర్భంగానే సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. మొదటి విడతగా తొమ్మిది కార్పొరేషన్లను పార్టీ సీనియర్లతో భర్తీ చేశారు. దీంతో మిగతా పదవుల భర్తీపై పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా స్థాయి కార్పొరేషన్ పదవులు పెరుగుతాయన్న ఆనందం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు పార్టీ సంస్థాగత పదవుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్ సహా పదిమంది జిల్లా అధ్యక్షులు ఉండగా.. ఇప్పుడు మరో 21 జిల్లాలకు అధ్యక్షులు, జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో పలువురు సీనియర్లకు జిల్లా అధ్యక్ష పదవులు దక్కనున్నాయి. కార్యవర్గాల్లో పెద్ద సంఖ్యలో నాయకులకు పదవులు దక్కనున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ల పదవులూ పెరుగుతాయి. తక్కువ మండలాలతోనే జిల్లాలు ఏర్పాటవుతుండడంతో ఆయా జిల్లాల్లో ముఖ్యులు అనుకున్న వారికి, శ్రేణుల్లో అత్యధికులకు పార్టీ సంస్థాగత పదవుల్లో అవకాశం దక్కుతుంది.