తాగుబోతుల నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఇటీవల చిన్నారి రమ్య మృతిచెందడంతో పోలీసులు చట్టాలను కఠినతరం చేశారు.
హిమాయత్ నగర్ : తాగుబోతుల నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఇటీవల చిన్నారి రమ్య మృతిచెందడంతో పోలీసులు చట్టాలను కఠినతరం చేశారు. ట్రాఫిక్ కమిషనర్ ఆదేశాల మేరకు నారాయణగూడ ట్రాఫిక్ పీఎస్ పరిధిలోని వైన్స్, బార్‌లు, పబ్‌లకు ఇన్‌స్పెక్టర్ బాలాజీ గురువారం నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారకుడైతే సంబంధిత బాలుడి తండ్రికి, వాహన యజమానులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ప్రమాదానికి కారుకుడైతే సెక్షన్ 337, ఇతని వల్ల వాహనదారులు గాయాలపాలైతే సెక్షన్ 338, చనిపోతే సెక్షన్ 304 పార్ట్-2కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు. తదనంతరం ఆ బాలుడికి 10 ఏళ్లు జైలు శిక్షపడుతుందన్నారు.
21ఏళ్ల లోపు మైనర్ ఎవరైనా లైసెన్స్ ఉన్నా, లేకుండా మద్యం సేవించి వాహనం నడిపితే సంబంధిత వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. మరి ముఖ్యంగా ఆ బాలుడికి మద్యం అమ్మిన వైన్, బార్, పబ్‌లకు లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఎక్సైజ్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపుతామన్నారు. వారి నుంచి నివేదిక వచ్చిన అనంతరం సంబంధిత దుకాణంను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాలపై ఇప్పటికే తమ ఠాణా పరిధిలోని వైన్ షాపులు, పబ్‌లు, బార్‌ల యజమానులకు నోటీసులను జారీ చేశామన్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలను ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.