
విద్యార్థులకు అండగా ఉంటాం: పీసీసీ చీఫ్ ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో జేఎన్‌టీయూ విద్యార్థులకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను శనివారం కలిశారు. డిటెయిన్ చేశారని విద్యార్థులు పోరాడితే పరీక్ష రాసే అవకాశం కల్పించారని,కానీ వారిలో దాదాపు 10వేల మందిని కావాలని ఫెయిల్ చేశారని ఉత్తమ్ ఆరోపించారు. జూనియర్ విద్యార్థులతో కలసి చదువుకోవాలని వారికి సూచించడం తీవ్ర అన్యాయమన్నారు. సిలబస్‌లో చాలా మార్పులు వచ్చాయని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు విద్యార్థులకు శాపాలుగా మారుతున్నాయని, ప్రభుత్వ విధానాలపై పోరాడుతామన్నారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు.
గవర్నర్ వ్యాఖ్యలతో నష్టం: మల్లు రవి
రాష్ట్రం అభివృద్ధిలో ఉందని గవర్నర్ నరసింహన్ చేసిన వ్యాఖ్యల వల్ల కేంద్రం నుంచి నిధులు తగ్గిపోతాయని, తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. రైతులకు రుణమాఫీ లేదని, కరువు నిధులు ఇవ్వలేదని, వరదల బారిన పడిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదని, స్కాలర్‌షిప్‌లు లేవని, బియ్యం సరిగా అందడం లేదని, ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల్లేవని, అభయహస్తం పింఛన్లు అందడం లేదని ఆరోపించారు. వీటికోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన గవర్నరే అంతా బాగుందంటే ఎలా అని, రాష్ట్రంలో ఉన్న సమస్యలు గవర్నర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.