సాక్షి, హైదరాబాద్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుకు, పాత పెన్షన్ స్కీం అమల్లోకి తెచ్చేందుకు సహకరించిన వారికే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల యూనియన్ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) స్పష్టం చేసింది. 2018లో సీపీఎస్‌ను ఎవరు రద్దు చేస్తారో వారికే 2019 ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని, అది కాంగ్రెస్ చేస్తే వారికి ఓట్లు వేస్తామని, బీజేపీ చేస్తే వారికే వేస్తామని, టీఆర్‌ఎస్ చేస్తే టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేస్తామని పేర్కొంది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ జనజాతర జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఉద్యోగులందరితో ప్రతిజ్ఞ చేయించారు. సీపీఎస్ రద్దుకు సహకరించని వారికి వ్యతిరేకంగా, పాత పెన్షన్ స్కీం అమల్లోకి తెచ్చేవారికి అనుకూలంగా తామే కాకుండా, తమ కుటుంబాలు, తమపై ఆధారపడిన వారు, తమకు పరిచయం ఉన్నవారితో ఓట్లు వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇందుకు ఈ ఏడాది ఆగస్టు 23 డెడ్‌లైన్ అని స్థితప్రజ్ఞ ప్రకటించారు. ఆలోగా సీపీఎస్‌ను రద్దు చేయాలని, లేదంటే విధులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ అన్న ప్రతిసారీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలున్నాయని అంటోందని, దేశంలో 20 రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే వేతనాలు తక్కువగా ఉన్నాయని వివరాలతో సహా వెల్లడించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సీపీఎస్‌లోనే చేరుతామని 2014 జూన్ 19న ట్రెజరీస్ డైరెక్టర్ రాసిన లేఖ, అదే నెల 23న ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, ఒప్పందం కాపీలను ‘ఏది నిజం’పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సీపీఎస్ రద్దు కేంద్రం పరిధిలో ఉందని సీఎం అంటున్నారని, నిజంగా కేంద్రం పరిధిలోనే ఉంటే దానినుంచి బయటకు తీసుకువచ్చే బాధ్యత మీకు లేదా? అని స్థితప్రజ్ఞ ప్రశ్నించారు.
సీపీఎస్ అమలు చేసినపుడు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా, రాష్ట్రంలోనూ మీ మంత్రులు లేరా? అని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం, కేంద్రం సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇస్తుంటే ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ‘సీపీఎస్ ఉద్యోగులకు ఉరి పడింది. 2004 సెప్టెంబర్ 1న కాదని, 2014 ఆగస్టు 23నాడే అని పేర్కొన్నారు.
1.32 లక్షల మంది ఉద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి, పాత పెన్షన్ స్కీం వద్దని, సీపీఎస్‌నే అమలు చేస్తామని పీఎఫ్‌ఆర్‌డీఏకు లేఖ రాసింది.. 28న జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తీరుపైనా మండిపడ్డారు. సీపీఎస్ ఉద్యోగిగా ఉండి, మరణించిన వారి కుటుంబాలు పెన్షన్‌కు కూడా నోచుకోని పరిస్థితులను ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో చెప్పించారు.
ఉద్యోగుల భవిష్యత్తు స్టాక్ మార్కెట్‌లో తాకట్టు
ప్రధాన వక్తగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ సీపీఎస్‌పై సీఎం మాటలకు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాటలకు పొంతనే లేదన్నారు. ఉద్యోగుల భవిష్యత్తును స్టాక్ మార్కెట్‌లో తాకట్టు పెట్టడానికి మీరెవరని ప్రశ్నించారు. ఇది పాత ఉద్యోగులకూ ప్రమాదకరమేనన్నారు. సంస్కరణలు అమలు చేసినపుడు ఒక సెక్షన్‌కు అమలు చేసి, మరో సెక్షన్‌కు అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందన్నారు.
సీపీఎస్ విషయంలో దానిని వర్తింపజేయాలని ఎవరైనా కోర్టుకు వెళితే దానిని పాత పెన్షన్ ఉద్యోగులకు వర్తింపజేయాలని చెప్పే అవకాశం ఉందన్నారు. అందుకే సీపీఎస్ రద్దుపై ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. అంతకంటే ముందు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శి ఎన్ ఉపేందర్, కార్యనిర్వాహక కార్యదర్శులు చంద్రకాంత్, సమీనాఖాద్రీ, ఉపాధ్యక్షులు దర్శన్, పి. శ్రీనివాస్, సలహాదారు రబీజుద్దీన్ ప్రసంగించారు.
ఇటీవల మరణించిన సీపీఎస్ ఉద్యోగి ఆవుల సంపత్ భార్య స్వరూపకు ఈ సందర్భంగా యూనియన్ తరపున చేయించిన బీమా ద్వారా వచ్చిన రూ. లక్షను అందజేశారు. సంఘం కోశాధికారి నరేశ్‌గౌడ్ రాసిన అక్షర కరవాలం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment