అ'ద్వితీయం'గా ఉండాలి
♦ రాష్ట్రావతరణ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సీఎం కేసీఆర్
♦ రాష్ట్రమంతా పండుగ వాతావరణం కనిపించాలి
♦ జిల్లా కేంద్రాల్లో అమరుల కుటుంబీకులను సన్మానించాలి
♦ ఉత్సవాల పర్యవేక్షణకు హోంమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు ఈటల రాజేందర్, చందూలాల్, కేటీఆర్, జూపల్లి కృష్ణారావులను ఇందులో సభ్యులుగా నియమించారు. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు నాయిని, ఈటల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర అధికారులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, ఇతర నగరాలు, జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే అంశంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
♦ హైదరాబాద్‌లో గవర్నర్, సీఎంతోపాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సభ నిర్వహించాలి.
♦ జిల్లా కేంద్రాల్లో జిల్లా మంత్రి, కలెక్టర్, ఇత ర ప్రముఖులు కార్యక్రమాల్లో పాల్గొనాలి
♦ అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించాలి. కార్యక్రమంలో వారికి వీఐపీ హోదా కల్పించాలి. 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా ఆహ్వానించి గౌరవించాలి.
♦ జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50 మందికి రాష్ట్ర స్థాయిలో, 25 మందికి జిల్లా కేంద్రాల్లో పురస్కారాలు అందించాలి.
♦ హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, జిల్లా కేంద్రాల్లో వీధులను, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను అలంకరించాలి. పరిశ్రమలు, ఆస్పత్రులు, హోటళ్లు, మాల్స్, థియేటర్లలో కూడా పండుగ వాతావరణం ఉండాలి. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని తెలుపుతూ బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి.
♦ ఎయిర్‌పోర్టు, హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లను కూడా అలంకరించి బ్యానర్లు ఏర్పాటు చేయాలి.
♦ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి. అనాథ శరణాలయాలు, అంధ విద్యార్థుల పాఠశాలల్లో పండ్లు, స్వీట్లు పంచాలి. మాంసాహారం అందించాలి.
♦ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి
♦ దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ఇతర ప్రార్థన స్థలాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి.
♦ జిల్లా కేంద్రాలు, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్ర ఆవిర్భావం ఇతివృత్తంగా తెలుగు, ఉర్దూ భాషల్లో కవి సమ్మేళనాలు
♦ రాష్ట్రంలోని అన్ని అమరవీరుల స్థూపాలు, తెలంగాణ తల్లి విగ్రహాలను అలంకరించాలి
♦ విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి.
♦ ట్యాంక్‌బండ్‌పై జూన్ 2 అర్ధరాత్రి పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చాలి.
♦ నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలకు స్వీట్లు పంపిణీచేయాలి.
నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ
రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది. ఇందులో కమిటీ అధ్యక్షుడు నాయినితోపాటు మంత్రులు ఈటల, చందూలాల్, కేటీఆర్, జూపల్లి, సీఎస్ రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొంటారు.