
ఎక్కడి వారు అక్కడే పని చేయాలి
పంజగుట్ట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ధేశపూర్వకంగా ఉద్యోగులమధ్య చిచ్చుపెట్టేందుకు చూస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేసి తెలంగాణలో రిలీవ్‌చేసిన విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోకపోతే తగిన విధంగా బుద్దిచెబుతామని హెచ్చరించారు. సోమవారం విద్యుత్‌సౌధాలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలనే డిమాండ్‌తో, ఆంధ్రా మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకంగా భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబు, ఆంధ్రా సీఎండీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్ శివాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, కారం రవీందర్, హమీద్, మామిడి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టానికి లోబడి స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేసి ఆంధ్రాప్రాంత ఉద్యోగులను రిలీవ్‌చేస్తే వారిని ఉద్యోగంలోకి తీసుకోరని, ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయకుండా ఏపీ ముఖ్యమంత్రి శాడిజం ప్రదర్శిస్తున్నారన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూకుట్రలతో ఇంకా హైదరాబాద్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజన జరగడం లేదన్నారు.
వెంటనే ఉద్యోగ విభజన చేయకపోతే కేంద్రం, ఆంధ్రా ప్రభుత్వాలు తమ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. జేఏసీ చైర్మన్ శివాజీ మాట్లాడుతూ ..ఆంధ్రాలో పనిచేస్తున్న 170 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 110 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని నేటి నుండి నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నారని వారికి ఏదైనా జరిగితే ఆంధ్రాప్రభుత్వానిదే బాధ్యతన్నారు. తమ డిమాండ్ల సాధనకు 27 వరకు నల్లబ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తామని, 28 నుండి 30 వరకు భోజన విరామ సమయంలో విద్యుత్‌సౌధాలో మౌన ప్రదర్శన, మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అయినా స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.