పిచ్చుక మచ్చుకైనా లేదే..! | World Sparrow Day today | Sakshi
Sakshi News home page

పిచ్చుక మచ్చుకైనా లేదే..!

Published Sun, Mar 20 2016 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

పిచ్చుక మచ్చుకైనా లేదే..!

పిచ్చుక మచ్చుకైనా లేదే..!

నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
 
ఎండు పుల్లల పిచ్చుక గూళ్లు చూడటం ఎంత ముచ్చటగా ఉంటుందో, అవి పెట్టిన గుడ్లను లెక్క పెట్టడం ఎంత సంతోషాన్నిస్తుం దో..! పిచ్చుకల గురించి ఈ తరానికి కథలాగ చెప్పడం తప్ప వాటితో మనకున్న అనుబంధం, ఆ అనుభూతిని వర్ణించలేము.  కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో పిచ్చుకలు అంతరించిపోతున్నాయనే ఆవేదన పక్షి ప్రేమికులను ఆవేదనకు గురి చేస్తోంది.  - బంజారాహిల్స్/సిటీ బ్యూరో
 
 కనుమరుగవుతున్న ఖాళీ స్థలాలు...పెరుగుతున్న ఆకాశ హర్మ్యాలు...గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్న చెట్లు...సెల్‌పోన్ల నుండి వెలువడుతున్న రేడియోధార్మికత ఇవన్నీ కలిసి ఒకప్పుడు కిలకిలా రావాలతో కళకళలాడిన ఊరపిచ్చుకలు అంతర్ధానమయ్యాయి. మెల్లమెల్లగా ఊరపిచ్చుక అరుదైన పక్షి జాబితాలోకి చేరిపోయింది. దశాబ్దం క్రితం వరకూ నగర వ్యాప్తంగా బర్డ్ వాచర్స్ లెక్కల ప్రకారం 10 వేలకుపైగా ఊరపిచ్చుకలు కిచకిచమంటూ నగరవాసికి సరికొత్త అనుభూతిని కలిగించేవి. అయితే ఇప్పుడా జాతి దాదాపుగా అంతిమ దశకు చేరుకోవడం పట్ల పక్షి ప్రియులు, పర్యావరణ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం నగర వ్యాప్తంగా పచ్చదనం, బాగా చెట్లు ఉన్నచోట మాత్రమే 500 వరకూ పిచ్చుకలు ఉన్న ట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడుకొనేందుకు వాటి మనుగడ కొనసాగి భావితరాలకు వాటి ప్రాముఖ్యతను తెలిపేందుకు వీటిపై అవగాహన కలిగించేందుకు, చైతన్యం తీసుకురావడానికి ప్రతియేటా మార్చి 20వతేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుతున్నారు.ఇందులో భాగంగానే పర్యావరణ నిపుణులు, పక్షి ప్రియులు ఈ రోజున  పిచ్చుకల అవగాహన కార్యక్రమాన్ని చేపడుతూ వీటిని రక్షించుకొనే తరుణోపాయాలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు.
 
90 శాతం కనుమరుగు...

జంట నగరాల్లో 90 శాతం పిచ్చుకలు కనుమరుగయ్యాయని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రసన్న కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తలుపులు, కిటికీలు మూసి ఉంచడం, పక్షి నిలబడే చోటు లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. జీవవైవిద్యానికి పిచ్చుక మచ్చుతునక అని ఈ రోజు దాని ఆనవాళ్ళు కోల్పోతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో శాంతినగర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బేగంపేట ఎయిర్‌పోర్ట్, నాగోల్, వివేకానందనగర్, కేబీఆర్‌పార్క్ ప్రాంతాల్లో మాత్రమే పిచ్చుకలు కనబడుతున్నాయని వెల్లడించారు.
 
అంతరించిపోతున్న పిచ్చుక జాతిని రక్షించడం, వాటి ఆవాసాలను గుర్తించి సదుపాయాలను ఏర్పాటుచేయడం లక్ష్యంగా సిటిజన్స్ యాక్షన్ ఫర్ లోకల్ బయోడైవర్టీస్ అండ్ కన్జర్వేషన్ (కాల్‌బ్యాక్) అనే సంస్థను పర్యావరణ నిపుణురాలు రజినీ వక్కలంక ఏర్పాటుచేశారు. అత్తాపూర్‌లోని తాను నివసిస్తున్న ఆంబియన్స్ ఫోర్ట్ కాలనీలో పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు చేశారు. కాలనీ బయట ఉన్న  పార్క్‌ను పూర్తిగా పిచ్చుకల రక్షిత ప్రాంతంగా జీహెచ్‌ఎంసీతో కలిసి తీర్చిదిద్దారు. ఎవరైనా పిచ్చుకల గూళ్ళు కావాలంటే చెక్క ముక్కలతో తయారు చేయించి ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకూ వేయి మందికి ఇలా పిచ్చుక గూళ్ళు పంపిణీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు వీటి ప్రాముఖ్యతపై అవగాహన కలిగిస్తున్నారు. అంతేకాకుండా ఎన్విరాన్‌మెంట్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ స్కూల్స్ అనే అంశంపై ఉస్మానియాలో పీహెచ్‌డీ కూడా చేశారు. తన స్నేహితురాలు రంజని, సుజాతతో కలిసి పిచ్చుకల రక్షణకు నడుం బిగించారు.
 
అవగాహన కల్పిస్తూ ముందుకు..
పిచ్చుకలను రక్షించుకోవడానికి కొన్ని ఫౌండేషన్‌లు సిటీలోని స్కూళ్లు, మాల్స్, రద్దీ ప్రదేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాయి. పిచ్చుకల విలువ తెలుపుతూ, వాటిని దూరం చేసుకోవడం ద్వారా మనం ఏం కోల్పోతున్నామో వివరిస్తున్నాయి. మనకు హానికరమైన కొన్ని రకాల సూక్ష్మజీవులను, పురుగులను అవి భక్షిస్తాయని తెలుపుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటే.. ఏఆర్‌పీఎఫ్ సంస్థ. వన్యప్రాణి ప్రేమికులైన కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, గృహిణులు వలంటీర్లుగా నిలిచి నేడు ‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ సందర్భంగా శనివారం సైక్లోథాన్, బైకథాన్, వాకథాన్ సైతం నిర్వహించారు.
 
 
రక్షించుకోవాల్సిన పక్షి
ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థిని హేమలత ఊరపిచ్చుకలు ఆవాసం ఏర్పాటు చేసుకునే ప్రాంతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులు వీటిని కాపాడాలి. తమ ఇళ్ల ముందు అట్టపెట్టెలతో చిన్న గూళ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంతేకాదు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పిచ్చుకలు వాలుతాయి. సెల్‌ఫోన్ల వాడకాన్ని తగ్గిస్తే ఈ పక్షి జాతి అంతరించిపోకుండా ఉంటుందని బోరబండ ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థిని హేమలత పేర్కొంది.
 
కాపాడుకుందాం
బంజారాహిల్స్:  జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. బోరబండలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థినులకు పిచ్చుకలపై అవగాహన కలిగించారు. ఫిలింషో నిర్వహించి పిచ్చుకలు, వాటి ఆవాసాలు, అవి కనుమరుగవుతున్న తీరును ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ వివరించారు. పలు అంశాల్లో పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పిచ్చుక గూళ్లను అందంగా తయారు చేసిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్ జనరల్ వినోద్ కె. అగర్వాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
 
 పిచ్చుకగూళ్ల తయారీ..
ఇంట్లో ఉండే స్క్రాప్ వేస్ట్, ఉడెన్ పీసెస్‌తో పిచ్చుకల గూళ్లు తయారు చేయొచ్చు. అలా తయారు చేసిన పిచ్చుక గూళ్లను స్నేహితులు, ఆత్మీయులకు గిప్ట్‌గా కూడా ఇవ్వొచ్చు. తద్వారా వారిలో పిచ్చుకలు అంతరించిపోతున్న విషయంపై ఆలోచన రేకెత్తించగలం. అంతేకాకుండా ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్నిటాలజీ విభాగం లాంటివి పిచ్చుక గూళ్లను ఉచితంగా పంపిణీ  చేస్తున్నాయి.  ప్రతి ఇంట్లో కిటికీకో, మూల చివర్లోనో, పైన వెంటిలేటర్ మీదో, చెట్టుకో ఇలా తయారు చేసిన గూళ్లను అమర్చితే.. ఒకటీ అరా ఏవైనా వస్తే అవి నివసించడానికి అవకాశం కల్పించిన వారమవుతాం. కేవలం గూళ్లను అమర్చుకోవడమే కాకుండా చిన్న చిప్పల వంటి వాటిలో మంచినీరు పోసి దాబాల పైన, వరండాలలో ఉంచడం, చిరుధాన్యాలు, జొన్నలు, నూకలను అక్కడక్కడ వెదజల్లుతుండడం చేస్తే వాటికి ఆహారం కల్పించిన వారమవుతాం. తద్వారా వాటి రాకను స్వాగతించొచ్చు. అలాగే మనకు వీలు కుదిరితే టై గార్డెన్స్ పెంచడం కూడా పిచ్చుకలను మన ఇంటివైపు ఆకర్షిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement