
అనాథలకు అండగా వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్: అనాథలను ఆదుకునేందుకు నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. అనాథ పిల్లలకు కూడా ఎస్సీ విద్యార్థుల తరహాలో అన్ని ప్రయోజనాలు కల్పించేందుకు 2008లోనే అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎస్సీ విద్యార్థుల మాదిరే అనాథ పిల్లలకు స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయాలు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్ 34 జారీ చేసింది.
దానికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీలో చేసిన ప్రకటన అనాథ పిల్లలకు మరింత బాసటగా నిలవనుంది. ‘‘రాష్ట్రంలో అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులు. వారిని ఎస్సీలుగా పరిగణిస్తాం. ఎస్సీల రిజర్వేషన్ కోటా తగ్గించకుండానే అనాథలకు అదనపు కోటా ఇస్తాం..’’ అని ప్రకటించడం ద్వారా కేసీఆర్ అనాథలకు తీపి కబురు వినిపించారు.