
హామీ నిలబెట్టుకోమంటే వేధిస్తారా?
- కాంట్రాక్టు లెక్చరర్లను తొలగించడం తగదు
- వారి పోరాటాలకు వైఎస్ జగన్ మద్దతు
- వైఎస్సార్‌సీపీ నేత బ్రహ్మానందరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీ కరిస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ చంద్రబాబు వైఖరిని దుయ్య బట్టారు.ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేస్తూ ఉంటే ఏకంగా ఉద్యోగాల నుంచి తీసేస్తామంటూ నోటీసు లివ్వడమే కాక, వారిపై కేసులు పెట్టడం తగ దన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పూర్తిగా తన సంఘీభావాన్ని తెలిపారని ఆయన వెల్లడించారు.
రాజమండ్రిలో 2012 ఫిబ్రవరి 4న మహిళా కాంట్రాక్టు లెక్చరర్లు సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ నిరాహార దీక్షలు చేస్తున్నపుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అక్కడికి వెళ్లి వారికి మద్దతు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆరోజు బాబు మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల డిమాండ్ న్యాయబద్ధ మైనదని చెప్పారని బ్రహ్మానందరెడ్డి నాటి పేపర్ క్లిప్పింగులు చూపారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని చెప్పిన బాబు సీఎం అయిన తర్వాత వాటిని మరిచిపోవడం దారుణమన్నారు. ఆ మాటలు మరిచి అదే లెక్చరర్లకు ఎలా నోటీసులు జారీ చేస్తారని ఆయన సీఎంను ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను తొలగించాలని ప్రిన్సిపాళ్లకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు.