ఏపీ బంద్ విజయవంతం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం తలపెట్టిన రాష్ట్ర బంద్ను ప్రజలు విజయవంతం చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాటమార్చడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్యని విమర్శించారు. బీజేపీ, టీడీపీలు ప్రత్యేకహోదాకు వ్యతిరేకశక్తులని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేశారని, చంద్రబాబు దేనికోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయమా? పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం కేంద్రంతో రాజీపడ్డారా అని నిలదీశారు. చంద్రబాబుతో చర్చించిన తర్వాతే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపీకి భవిష్యత్ ఉందని, హోదా సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే రాయితీల వల్ల పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమంలోకి రావాలని కోటంరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచి వైఎస్ఆర్ సీపీ, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని చెప్పారు.