దేశం గర్వించదగ్గ మేధావి అంబేడ్కర్
- వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
- పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: భారతదేశం నిజంగా గర్వించదగ్గ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంత భేదాలు లేని సమసమాజం కోసం ఆ మహానీయుడు రాజ్యాంగ రచన చేశారని గుర్తు చేశారు.
దండలు వేయడం కాదు... దళితుల గుండెలు గెలవాలి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానాలకు తూట్లు పొడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఆయన విగ్రహాన్ని పెడతాననడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుతో అంబేడ్కర్ ఆత్మ క్షోభిస్తోందని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహాలకు దండలు వేస్తే సరిపోదని, దళితుల గుండెలను గెలవాలని హితవు పలికారు. అంబేడ్కర్ భావజాలాన్ని విస్తరించాలనే ఆకాంక్ష ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు.