'ఇంత దారుణమా.. సభకు సెలవు' | ysrcp walkout from ap assembly | Sakshi
Sakshi News home page

'ఇంత దారుణమా.. సభకు సెలవు'

Published Mon, Dec 21 2015 9:36 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

'ఇంత దారుణమా.. సభకు సెలవు' - Sakshi

'ఇంత దారుణమా.. సభకు సెలవు'

హైదరాబాద్‌: ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం శాసనసభ సమావేశాలను బహిష్కరించింది. ఓపక్క కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై చర్చ చేపట్టేందుకు అంగీకరించకపోవడం, మరోవైపు ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసే ప్రసక్తి లేదని ప్రభుత్వం చెప్పడంతో ఇక చేసేది లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా సభనుంచి బాయ్ కాట్ చేశారు.

నేటి సమావేశంలో ఏం జరిగిందంటే..


సోమవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభంకాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా పలువురు మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సెక్స్ రాకెట్ పై చర్చ, దాని అనంతరం పరిణామాలను గత మూడు రోజులుగా ప్రజలు చూస్తున్నారని అన్నారు. కాల్ మనీపై చర్చ చేపట్టాలని, అలాగే రోజాపై సస్పెన్షన్ పునఃమీక్షించకుంటే తామంతా మూకుమ్మడిగా సభను బాయ్ కాట్ చేస్తామని తెలిపారు. రోజా సస్పెన్షన్పై అవసరం అయితే, కోర్టుకు కూడా వెళతామని అన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశం తీవ్రతను తగ్గించేలా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్నారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

అనంతరం విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ బీజేపీ ఒక జాతీయ పార్టీ అని తెలుసుకుంటే మంచిదని, తమ పార్టీ టీడీపీకి మిత్రపక్షం మాత్రమేనని అన్నారు. ప్రతిసారి కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ అదేదో పెద్ద రాకెట్ గా చెప్పే ప్రయత్నం చేయడం సరికాదని, అది పేపర్ కటింగ్స్ లో తప్ప అంత తీవ్రతతో ఉన్నది కాదన్నట్లుగా మాట్లాడారు. అనంతరం ప్రభుత్వం తరుపున మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసేది లేదని స్పష్టం చేశారు. సెక్స్ రాకెట్ పై చర్చ ఇప్పటికే పూర్తయిందని కూడా అన్నారు. ఆ వెంటనే స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్నే తిరిగి మరోసారి ప్రస్తావిస్తూ రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసేది లేదని, ఇప్పుడు మీ నిర్ణయమేమిటో చెప్పాలని ప్రశ్నించగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేచి మాట్లాడారు.

తాము ఇంతగా విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తూ అధికారం ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే తాము అంగీకరించేది లేదన్నారు. బీఏసీ లో జరిగిన వ్యవహారాలు చెప్పాలని తమ ఎమ్మెల్యే ప్రయత్నించినా వినకపోవడం, కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు అంగీకరించకపోవడం, రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయనని చెప్పడం చాలా దారుణం అని, ఇంతకంటే బాధపెట్టే విషయం మరొకటి లేదని, ఇక మీకు సెలవు అంటూ తమ పార్టీ నేతలతో మూకుమ్మడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement