మోకాళ్ళ నొప్పులకు త్రీడీ ప్రింటింగ్..!
మోకాళ్ళ నొప్పులతోపాటు, దెబ్బతిన్న చెవి, ముక్కు వంటి వాటికి త్రీడీ ప్రింటెడ్ ఇంప్లాంట్స్ తో సులభంగా చికిత్స చేయొచ్చని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. క్రీడాకారులు, వృద్ధులు, గాయాలవల్ల ఇబ్బందిపడే అనేక మందితో పాటు ఆర్థరైటిస్ ఉన్నవారు కార్టిలేజ్ (మృదులాస్థి) కోల్పోయి తీవ్రమైన నొప్పులతో బాధపడుతుంటారు. ఇటువంటి వారికోసం ఓ సరికొత్త ప్రయోగాన్ని అందుబాటులోకి తెచ్చింది అమెరికా శాండియాగోలోని అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీసీ). 251వ జాతీయ సమావేశాల సందర్భంలో ఈ ప్రయోగాన్ని పరిశోధకులు పరిచయం చేశారు.
త్రీ డైమెన్షనల్ బయో ప్రింటింగ్ అనేది సాంకేతిక కణజాల పునరుత్పత్తికి తోడ్పడుతుందని, ఇది వైద్య చరిత్రలో విప్లవాన్ని సృష్టిస్తుందని స్వీడన్ వాలెన్ బర్గ్ వుడ్ సైన్స్ సెంటర్ కు చెందిన పరిశోధక బృందంలోని పాల్ గాటెన్ హోమ్ చెప్తున్నారు. గాయాలు, కేన్సర్ వంటి వాటివల్ల నష్టపోయిన కార్టిలేజ్ (మృదులాష్టి) ను సృష్టించేందుకు తమ బృదం ప్లాస్టిక్ సర్జన్స్ తో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తోందన్నారు. ప్రస్తుతం సర్జెన్లు ముక్కు, చెవి వంటి శరీరంలోని ఇతర భాగాలను బాగు చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోందని, ఏదో ఓరోజు త్రీడీ ప్రింటింగ్ ద్వారా రోగి కణాల నుంచి తయారు చేసే బయో ఇంక్ తో అటువంటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని గాటెన్ హోమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్తగా తయారు చేసే బయో ఇంక్ తో గాటెన్ హోమ్ బృదం ప్రయోగశాల ద్వారా మృదులాస్థిని ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు జరుపుతోంది. ప్రయోగశాల్లో తయారైన ప్రింటెడ్ టిష్యూ శాంపిల్స్ ను పరిశోధకులు ఎలుకలకు అమర్చి చూశారు. కణాలు పనిచేయడంతోపాటు మృదులాస్థి ఉత్పత్తి అయినట్లుగా కొనుగొన్నారు. అయితే కణజాల సంఖ్యను పెంచేందుకు ఇక్కడ మరో అడ్డంకి ఎదురైంది. దీంతో ఎముక మజ్జు నుంచి తీసిన మూల కణాలతో కాండ్రోసైట్స్ ను కలిపి 60 రోజులపాటు వివో టెస్టింగ్ లో ఉంచారు. ఈ ప్రాధమిక పరిశోధనలు కాండ్రోసైట్ ను మృదులాస్థిని పెంచేందుకు ప్రోత్సహించినట్లు కనుగొన్నారు. ఇక మానవులపై ప్రయోగించేందుకు ముందుగా కొన్ని ప్రీ క్లినికల్ పరీక్షలు చేయాల్సి ఉన్నట్లుగా గాటెన్ హోమ్ తెలిపారు.