ట్యాంక్‌మ్యాన్ ప్రతిఘటనకు దిగిన వేళ – 1989 జూన్ 5న కొందరు అతడి ఫొటోలు తీశారు. ఆ సమయంలో అతడు తెల్ల చొక్కా వేసుకున్నాడు. చేతిలో రెండు సంచులు న్నాయి. నేరుగా వెళ్లి భారీ ట్యాంకులకు ఎదురొడ్డి నిలబడ్డాడు. విదేశీ పత్రికల ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సమీప హోటళ్ల బాల్కనీల్లో నుంచి అతడి ఫొటోలు తీశారు. ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. అతడికి మరణశిక్ష అమలు చేశారని కొందరు భావిస్తుంటారు. ఎక్కడో రహస్య జీవనం గడుపుతున్నాడనేది మరికొందరి అభిప్రాయం. మిలటరీ అతడి ప్రాణానికి ఎలాంటి హానీ తలపెట్టలేదని చైనా అధికారులు ప్రకటించారు. చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కూడా 1990లో బార్బరా వాల్టర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతణ్ణి చంపలేదని చెప్పారు.
మొత్తం మీద ట్యాంక్‌మ్యాన్ గురించిన చర్చ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఆ ధీరునికి ఏమయ్యిందో వెల్లడించాలని చైనా ప్రభుత్వాన్ని కోరుతూ తియానన్మెన్ నిరసనల్లో పాల్గొని, ప్రస్తుతం ఆమెరికాలో హక్కుల కార్యకర్తగా పని చేస్తున్న యాంగ్ జియాన్లీ ఇటీవల ఒక పిటిషన్ రూపొందించి విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాడు. ట్యాంక్ మ్యాన్ జ్ఞాపకాలను తుడిచేసే పనిలో పడిన చైనా.. ఇటీవల అతడి ఆన్‌లైన్ ఫొటోలపై నిషేధం విధించింది. ఆజ్ఞలను ధిక్కరించిన వారికి శిక్ష విధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 49 శాతం మంది అతడి ఫొటోలను తాము గుర్తుపడతామంటారు.
చైనా వెలుపల ట్యాంక్‌మ్యాన్ ఒక హీరో. అతడిని కేంద్రంగా చేసుకుని పలు పుస్తకాలు, డాక్యుమెంటరీలు వెలువడ్డాయి. టీవీ షోలు ప్రసారమయ్యాయి. ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఏర్పాటయ్యాయి. ‘చిమెరికా’పేరిట ఇటీవల ప్రారంభమైన బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ ట్యాంక్‌మ్యాన్ పాపులారిటీకి ఒక ఉదాహరణ. ట్యాంక్‌మ్యాన్ మిస్టరీని ఛేదించేందుకు ఓ అమెరికన్ ఫొటో జర్నలిస్టు జరిపే అన్వేషణ ఇందులోని ఇతివృత్తం. మొత్తం మీద – తన చిత్రాలు, పోస్టర్లు, తన చిత్తరువులు ముద్రితమైన టీ షర్టులు, టీవీ షోల ద్వారా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు ట్యాంక్‌మ్యాన్.
అమెరికా, చైనా పరస్పర విమర్శలు
బీజింగ్/వాషింగ్టన్: ఊచకోత ఘటనలో ఎంతమంది ప్రజాస్వామ్యవాద నిరసనకారులు మరణించారో బహిరంగంగా ప్రకటించాలంటూ చైనాను అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో కోరారు. మారణకాండకు చైనా ఆర్మీదే బాధ్యత అని అన్నారు. దీనిపై చైనా విదేశాంగ మంత్రి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ అమెరికా ఆరోపణలను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. పాంపియో వ్యాఖ్యలపై అమెరికాతో తీవ్ర చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ‘ప్రజాస్వామ్యం, మానవహక్కులనే నెపంతో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే కొందరు అమెరికా వ్యక్తులు తమ సొంత దేశంలోని సమస్యలపై మాత్రం మాట్లాడటం లేదు’ అని షువాంగ్ అన్నారు.
చైనా మౌనం వీడాలి: ఈయూ
తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన దారుణాలపై చైనా పెదవి విప్పాలనీ, 30 ఏళ్ల క్రితం అక్కడ చనిపోయిన నిరసనకారులు ఎంతమందో, ఇంకెందరిని జైళ్లలో పెట్టారనే సంఖ్యలను చైనా ప్రకటించాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) డిమాండ్ చేసింది. అప్పుడు అరెస్టయిన వారిలో ఇంకా జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని చైనాను ఈయూ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment