ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి.
అబూజా : ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది మరణించగా... 150 మంది గాయపడ్డారని నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు మసీదు వద్ద కాల్పులు జరిపి పరారయ్యారని చెప్పారు.
ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారని.... ఆ వెంటనే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు బాధ్యులం తామేనంటూ ఇంత వరకు ఎవరు ప్రకటించలేదని చెప్పారు. నైజీరియాలోని బోకోహరామ్ తీవ్రవాదులే ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నామని చెప్పారు. ఈ సంస్థ ఏడాది జరిపిన విధ్వంసంలో దాదాపు 3 వేలమందికి పైగా మరణించారని పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు.