
ఆత్మాహుతి దాడి ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బీభత్సం సృష్టించారు. గంట వ్యవధిలోనే రెండు చోట్ల ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ ఘటనలు ప్రజల్లో భయాందోళనను కలిగిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఈ వరుస ఘటనల్లో 48 మంది మరణించగా, 80 మందికిపైగా గాయపడ్డారు. ఇందులో మొదటి ఆత్మాహుతి దాడి ఆ దేశ అధ్యక్షుడి ఎన్నికల ప్రచారంలో కాగా, రెండోది కాబూల్‌లో చోటు చేసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని తాలిబన్ హెచ్చరించింది. ఈ ప్రమాదం నుంచి ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.
గంట వ్యవధిలో..
మోటార్ బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు ర్యాలీ దగ్గరి చెక్‌పోస్టు వద్ద బాంబు పేల్చుకొని దాడికి పాల్పడినట్టు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి నస్రత్ రహిమీ తెలిపారు. పేలుడు ఘటనలో 26 మంది మరణించగా, 42 మంది గాయపడ్డారు. ఈ పేలుడు జరిగిన గంట వ్యవధిలోనే కాబుల్‌లోని అమెరికా ఎంబసీ సమీపంలో మరో ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ పేలుడులో 22 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు. పేలుడు అనంతరం కొన్ని మృతదేహాలను కూడా వీధిలో చూసినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పినట్లు వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై, ట్రంప్ సెప్టెంబర్ 10న తాలిబన్లతో చర్చలను అకస్మాత్తుగా ముగించిన తర్వాత ఈ పేలుళ్లు జరగడం గమనార్హం.