సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఐరోపాలో అతిపెద్ద దేశమైన జర్మనీ పార్లమెంటులో దిగువ సభ బుందేస్టాగ్‌కు ఆదివారం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ (63) వరుసగా నాలుగోసారి అధికారం చేపడతారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అలాగే ఇస్లాంను, వలసలను వ్యతిరేకించే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ తొలిసారిగా బుందేస్టాగ్‌లో అడుగుపెట్టనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పోటీచేసిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎస్‌పీడీ) ప్రస్తుత పాలక కూటమిలో భాగస్వామిగా ఉండటం విశేషం.
జర్మనీలో రెండు ప్రధాన రాజకీయపక్షాలైన క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ), ఎస్‌పీడీ కలిసి ప్రభుత్వాన్ని నడిపితే దాన్ని ‘మహా సంకీర్ణం’ (గ్రాండ్ కొయెలేషన్) అని పిలుస్తారు. ప్రస్తుత మహాసంకీర్ణం సజావుగా నడవడం లేదనీ, భవిష్యత్తులో దీనిని కొనసాగించకూడదని భావించిన ఎస్‌డీపీ ఈ ఎన్నికల్లో అధికారం కోసం సొంతంగా పోటీపడింది. చాన్స్‌లర్ పదవికి ఎస్‌పీడీ అభ్యర్థిగా 61 ఏళ్ల మార్టిన్ షూల్జ్ రంగంలోకి దిగారు. ఐరోపా కూటమి పార్లమెంటు అధ్యక్షునిగాను 2012, 2014లో షూల్జ్ ఎన్నికయ్యారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి బుందేస్టాగ్‌కు ఎన్నికలు జరుగుతాయి.
తాజా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మెర్కెల్ పార్టీకి 32.5–33.5 శాతం, ఎస్‌పీడీకి 20–21%, ఏఎఫ్‌డీకి 13–13.5% ఓట్లు వచ్చాయి. 2005లో తొలిసారిగా ఏంజిలా చాన్స్‌లర్ పదవి చేపట్టారు. ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ)–క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో ఆధిక్యం సాధించడంతో పన్నెండేళ్లుగా ఏంజిలానే చాన్స్‌లర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే 16 ఏళ్లు అధికారంలో ఉండి, హెల్ముల్ కోల్ రికార్డును మెర్కెల్ సమం చేస్తారు.
రెండు ఓట్లు–దామాషా పద్ధతి!
జర్మనీలో ఓటు హక్కు కలిగినవారు ఆరు కోట్ల పదిహేను లక్షలమంది ఉన్నారు. బుందేస్టాగ్‌లో మొత్తం 598 మంది సభ్యులుంటారు. అందులో సగం మంది సభ్యులను(299 మంది) అంతే సంఖ్యలో ఉండే నియోజకవర్గాల నుంచి ఎన్నుకుంటారు. మిగిలిన సగం సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం(దామాషా పద్ధతి) ద్వారా ఎంపిక చేస్తారు. పోలింగ్ రోజు ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేస్తారు.
ఒక ఓటు బుందేస్టాగ్‌లో తమ నియోజకవర్గ ప్రతినిధికి, రెండో ఓటు తమ కిష్టమైన రాజకీయ పార్టీకి వేసే హక్కు పౌరులకు ఉంది. మొదటి ఓటు ద్వారా 299 మంది బుందేస్టాగ్ సభ్యులు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతారు. రెండో ఓటు ద్వారా మిగిలిన సగం మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు. కనీసం 5 శాతం ఓట్లు దక్కించుకున్న ప్రతి రాజకీయపక్షం అదే నిష్పత్తిలో సభ్యులను (299లో వాటా కింద) బుందేస్టాగ్ సభకు నామినేట్ చేసుకుంటుంది. 5% ఓట్లు కూడా రాని పార్టీకి ఈ పద్ధతిలో సభ్యులను పంపే అర్హత ఉండదు.
జర్మనీ చాన్స్‌లర్‌గా మెర్కెల్!
Published Mon, Sep 25 2017 3:27 AM | Last Updated on Mon, Sep 25 2017 9:10 AM
Advertisement
Advertisement