ఐఫోన్ మళ్లీ పేలింది!
సిడ్నీ: శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు తరచుగాగా చోటు చేసుకోవడంతో ఆ కంపెనీ గత త్రైమాసికంలో ఆ కంపెనీ మార్కెట్ పై ప్రభావం చూపింది. శాంసంగ్ నుంచి పోటీ తగ్గుతుందని యాపిల్ సంబరపడింది. కానీ ప్రస్తుతం యాపిల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా దిగ్గజ కంపెనీ యాపిల్ ఐఫోన్లు పేలుతుండటం ఆ కంపెనీ యూజర్లను ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో ఓసారి ఐఫోన్ 6, మరోసారి ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ స్మార్ట్ ఫోన్ పేలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఐఫోన్ 7 పేలిపోయి ఓ కారులోని వస్తువులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ఘటన ఆస్ట్రేలియా లోని న్యూసౌత్ వెల్స్ లో చోటుచేసుకుంది.
బాధితుడి కథనం ప్రకారం.. తన పేరు మాట్ జోన్స్ అని తాను సర్ఫింగ్ కు వెళ్లగా తన ఐఫోన్ పేలిపోయిందని అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. తాను సర్ఫింగ్ కు వెళ్తూ ఐఫోన్ 7ను కారులో వదిలివెళ్లానని, తిరిగొచ్చి చూసే సరికి కారు నిండా దట్టమైన పొగ వ్యాపించిందని చెప్పాడు. కేవలం వారం కిందటే ఐఫోన్ తాను కొనుగోలు చేయగా.. అంతలోనే ఫోన్ పేలిపోయిందన్నాడు. తాను కేవలం కంపెనీ ఇచ్చిన ఛార్జర్ మాత్రమే వాడినట్లు తెలిపాడు. బ్యాటరీల తయారీలో లిథియం-అయాన్ వాడుతున్న స్టార్ట్ ఫోన్ల లోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
పేలుడుకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టామని గతంలో ఐఫోన్లు పేలిన సందర్భంలో కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే ఆగస్టులోనే ఐఫోన్ తొలిసారిగా పేలినా.. రెండు నెలల తర్వాత కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కొన్ని రోజుల కిందట ఐఫోన్ 6 పేలి ఓ వ్యక్తి గాయపడిన ఘటన ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సిడ్నీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గారెత్ క్లియర్ బైకుపై వెళుతుండగా వెనుక జేబులో పెట్టుకున్న ఐఫోన్ నుంచి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో అతడికి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. (తప్పక చదవండీ: స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?)