
శ్మశానంలో పేలుళ్లు.. 18 మంది మృతి
ఆఫ్గనిస్తాన్ రాజధాని నగరం కాబూల్ సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి
కాబూల్: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఓ శ్మశానంలో అంత్యక్రియలకు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకొని జరిపిన బాంబు దాడుల్లో సుమారు 18 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
శుక్రవారం పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన సలీమ్ ఇజాద్యార్ అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ పేలుళ్లు జరిపారు. శ్మశానంలో వరుసగా మూడు పేలుళ్లు జరిగాయని అధికారులు వెల్లడించారు. పేలుళ్ల దాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకున్న దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి.
బుధవారం కాబూల్‌లో జరిగిన బాంబు దాడిలో 90 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని శుక్రవారం కాబూల్‌లో ప్రజలు ఆందోళన చేస్తుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో సీనియర్ పొలిటికల్ లీడర్ కుమారుడు సలీమ్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు.