
నిందితుడు పేల్చేసుకున్న వాహనం.. ఇన్‌సెట్‌లో మార్క్ కండిట్ట్
ఆస్టిన్ : మూడు వారాలుగా టెక్సాస్ రాష్ట్ర పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పేలుళ్ల మిస్టరీ వీడింది. పేలుళ్లకు పాల్పడిన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. కానీ, ఈ క్రమంలో తనను తాను పేల్చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గత మూడు వారాలుగా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో వరుసగా పార్సిళ్లతో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటిదాకా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఐదు పేలుళ్లు సంభవించగా ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి గాయలయ్యాయి. బోస్టర్ మారథాన్ పేలుళ్ల (2013) తర్వాత వరుసగా ఇవి చోటు చేసుకుండటంతో స్వాట్ విభాగం అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో నిందితుడి కోసం కీలక ప్రాంతాల్లో జల్లెడ పట్టారు.
బుధవారం మార్క్ కండిట్ట్ అనే యువకుడు తానే ఈ పేలుళ్లకు పాల్పడినట్లు పోలీసులకు వీడియో సందేశం పంపాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో తాను ఉన్న ఎస్‌యూవీ వాహనాన్ని పేల్చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పేలుళ్లకు అతను ఎందుకు పాల్పడ్డడన్న విషయాన్ని మాత్రం అతను వెల్లడించకపోవటంతో.. కారణాలు వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
మొత్తం ఏడు బాంబులతో తాను ప్రణాళిక రచించానని, కానీ, అవి విఫలం కావటంతో లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు నిందితుడు వీడియోలో వెల్లడించాడని అధికారులు చెబుతున్నారు. కాగా, ఐదు పేలుళ్లు సంభవించగా. మరొక దానిని బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. ఇక చివరిది కండిట్ట్ వాహనంలో పేలిపోయిందని అధికారులు తెలిపారు.
AUSTIN BOMBING SUSPECT IS DEAD. Great job by law enforcement and all concerned!
— Donald J. Trump (@realDonaldTrump) 21 March 2018