వాలీబాల్ టోర్నీపై నెత్తుటి పంజా
- అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదుల దురాగతం
- ఆత్మాహుతి దాడిలో 50 మందికిపైగా దుర్మరణం
కాబూల్/ఖోస్ట్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి నెత్తుటి పంజా విసిరారు. వాలీబాల్ టోర్నమెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వచ్చిన సమయంలో ఈ దాడి జరగడంతో సుమారు 50 మంది మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మోటార్ సైకిల్‌పై వాలీబాల్ గ్రౌండ్‌లోకి వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు.
పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పక్తికా ప్రావిన్స్‌లోని యాహ్యా ఖైల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాలిబన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో అఫ్ఘాన్ నేషనల్ ఆర్మీ, పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 12,500 నాటో బృందాలు వచ్చే ఏడాది కూడా దేశంలో కొనసాగేందుకు అఫ్ఘానిస్థాన్ పార్లమెంట్ ఆమోదించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం.
యాహ్యా ఖైల్‌లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుండగా ఈ దాడి జరిగిందని పక్తికా ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అతావుల్లా ఫజిల్ వెల్లడించారు. ఈ సమయంలో మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని, ప్రొవిన్షియల్ అధికారులు, పోలీస్ చీఫ్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారని చెప్పారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
అయితే ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. అఫ్ఘాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది నెలలుగా తాలిబన్ ఉగ్రవాదులు యుద్ధం ప్రకటించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వరుస దాడులు చేస్తున్నారు. దేశంలో అత్యంత క్లిష్టమైన పక్తికా ప్రాంతంలో గత జూలైలోనూ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
రద్దీ మార్కెట్‌లోకి ట్రక్కుతో ప్రవేశించిన ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో 41 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా, వాలీబాల్ టోర్నమెంట్ లక్ష్యంగా ఉగ్రవాదుల దాడిని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఖండించారు. తాజా దాడి ఈ ఏడాది అఫ్ఘాన్‌లో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా అధికారులు పేర్కొంటున్నారు.