
ఈ అబ్బాయి.. చిరుతయ్యాడు
దక్షిణాఫ్రికాలో ఓ బాలుడు మృత్యువు అంచులదాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ బాలుడ్ని ఇప్పుడు అందరూ చిరుత అని పిలుస్తున్నారు.
కేప్టౌన్: దక్షిణాఫ్రికాలో ఓ బాలుడు మృత్యువు అంచులదాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ బాలుడ్ని ఇప్పుడు అందరూ చిరుత అని పిలుస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. కేప్ టౌన్లో జస్టిన్ అనే వ్యక్తి తన ఇద్దరు కొడుకులతో కలసి పార్క్కు వెళ్లాడు. పార్క్లో కొడుకులిద్దరూ ఆడుకుంటుండగా, జస్టిన్ ఎదుటే చిరుత వారిపై దాడి చేసింది. కెల్లన్ డెన్నీ అనే ఆరేళ్ల బాలుడిని చిరుత నోటితో కరుచుకుని లాక్కెళ్లింది. జస్టిన్ తన కొడుకును రక్షించుకునేందుకు వెంటనే చిరుతను వెంబడించాడు.
చిరుత 100 అడుగుల దూరం లాక్కెళ్లిన తర్వాత డెన్నీని వదిలేసిపారిపోయింది. చిరుత కొరకడంతో డెన్నీ మెడ, చేతులు, భుజాలపై గాయాలయ్యాయి. జస్టిన్ తన కొడుకును దగ్గరలోని ఓ కుటీరంలోకి తీసుకెళ్లి గాయాలకు చికిత్స చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. ఈ ఘటన తమ కుటుంబానికి ఎంతో బాధకలిగించిందని జస్టిన్ వాపోయాడు. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడినా ప్రాణాలతో బయటపడిన డెన్నీని ఇప్పుడు అందరూ 'చిరుత బాలుడు' అని పిలుస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఇలాంటి దాడి జరగలేదని పార్క్ మేనేజర్ చెప్పాడు.