
లండన్: బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించేందుకు ఈ ఏడాది పెద్దమొత్తంలో భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి భారతీయ విద్యార్థుల దరఖాస్తులు 36శాతం పెరిగినట్లు సోమవారం వెల్లడైన గణాంకాల్లో తేలింది. ఈ ఏడాది యురోపియన్ యూనియన్(ఈయూ), ఇతర దేశాల నుంచి ఏకంగా లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయని యూనివర్సిటీస్ అండ్ కాలేజీస్ అడ్మిషన్స్ సర్వీస్(యూసీఏఎస్) ఎక్స్‌టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ హెలెన్ థోర్న్ చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఈయూ విద్యార్థుల దరఖాస్తులు 3.4 శాతం పెరగ్గా, ఇతర దేశస్తుల దరఖాస్తులు 11శాతం ఎక్కువయ్యాయి. అందరికంటే ఎక్కువగా చైనా నుంచి 11,920 దరఖాస్తులు వచ్చాయి.