రన్ వేపై తగలబడుతున్న బోయిన్ 777 విమానం
- లాస్ వెగాస్ మెక్ కారెన్ విమానాశ్రయంలో ఘటన
- ప్రమాద సమయంలో విమానంలో 172 మంది
టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెరేగిన సంఘటన అమెరికాలోని లాస్ వెగాస్ మెక్ కారెన్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగింది. పెనుముప్పు తప్పినట్లుగా భావిస్తున్న ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777 విమానం లాస్ వెగాస్ నుంచి లండన్ వెళ్లాల్సిఉంది. ఇంధనం నింపుకొన్న అనంతరం టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చింది. అంతలోనే విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 159 మంది ప్రయాణికులతోపాటు 13 మంది సిబ్బంది కూడా ఉన్నారు. లోపలంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు.
వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది.. పరుగున విమానం వద్దకు చేరుకుని అత్యవసర కిటీకీలను బద్దలుకొట్టి ప్రయాణికులను కిందికి దించారు. మంటలు చెలరేగడం రెండు నిమిషాలు ఆలస్యమయ్యేదుంటే విమానం వేగానికి భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఇద్దరు ప్రయాణికులు మాత్రం గాయపడ్డారని, మిగతావారిని సురక్షితంగా కాపాడగలిగామని అత్యవసర సిబ్బంది చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.