విమానాన్ని పేల్చబోయి కింద పడ్డాడు!
సోమాలియా: అది సోమాలియా నుంచి జిబౌతికి బయలుదేరిన డాలో ఎయిర్ లైన్స్కు చెందిన డీ3159 విమానం. సోమాలియా విమానాశ్రయం నుంచి జిబౌతికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. గాల్లోకి విమానం ఎగిరి ఐదు నిమిషాలు గడిచిందో లేదో సరిగ్గా ఇంజిన్ రెక్కభాగం వైపుగా ఉన్న డోర్ వద్ద డామ్మని పేలుడు. విమానంలోని ప్రయాణికులు చూస్తుండగా కాలుతూ ఉన్న ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు దాదాపు 14 వేల అడుగుల ఎత్తులో నుంచి కింద పడిపోయాడు.
అయితే, అదృష్టవశాత్తు ఆ విమానం నియంత్రణ కోల్పోలేదు. చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్ విమానాన్ని వెనక్కితిప్పి సురక్షితంగా తిరిగి సోమాలియా విమానాశ్రయంలో దించివేశాడు. దీంతో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. సోమాలియా సాధారణంగానే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన అల్ షహాబ్ నుంచి ముప్పును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పేలుడు సంభవించిన సందర్భంగా అధికారులు, అందులోని ప్రయాణీకులు పలు రకాల అంశాలు తెలిపారు.
విమాన పైలెట్ వ్లాదిమిర్ వోడోపివెక్(64) ఈ సంఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ 'నేను అనుకుంటున్నాను అది ఒక బాంబు. అదృష్టవశాత్తు విమానం నియంత్రణ కోల్పోలేదు. అందుకే, నేను తిరిగి మొగాదిషు విమానాశ్రయంలో ఫ్లైట్ దించివేశాను. నా జీవితం మొత్తంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదు' అని అన్నారు. ఇక ఇదే విమానంలో ప్రయాణించిన సోమాలియా అంబాసిడర్ అవాలే కుల్లానే ఫేస్ బుక్ లో ఈ ఘటన వివరిస్తూ 'విమానంలో పెద్ద శబ్దం వచ్చింది. కానీ అక్కడ ఏం కనిపించలేదు.. కొద్ది సెకన్లపాటు దట్టంగా పొగమాత్రం వచ్చింది' అని చెప్పారు.
ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని చెబుతూ 'నాకు తెలియదు అది బాంబో లేక విద్యుత్ షాకో.. కానీ విమానంలో పెద్ద శబ్దం మాత్రం వినిపించింది. అయితే, ఓ వ్యక్తి విమానం నుంచి పడిపోయాడా లేదా అని మాత్రం నాకు తెలియదు' అని చెప్పాడు. కాగా మహ్మద్ హుస్సేన్ అనే పోలీసు అధికారి మాట్లాడుతూ బలాద్ పట్టణంలో విమానం పై నుంచి పడిన ఓ పెద్దాయనను గుర్తించారు అని చెప్పాడు. అయితే, విమానం నుంచి పడిపోయిన వ్యక్తి ఉగ్రవాదా, లేక విమానంలో ఏదైన పేలుడు పదార్థం పేలి కారణంగా పడిపోయాడా, లేదా ఆత్మాహుతి దాడికి దిగి ఆ మంటలు అంటుకున్న కారణంగా తట్టుకోలేక కిటికీలో నుంచి దూకేశాడా అనేది దర్యాప్తు అనంతరం తేలాల్సి ఉంది.