![హిట్లర్ అరుదైన ఫోటోలకు భారీ ధర](/styles/webp/s3/article_images/2017/09/5/51489899639_625x300.jpg.webp?itok=34OS-Kio)
హిట్లర్ అరుదైన ఫోటోలకు భారీ ధర
లండన్: జర్మనీ నియంత, రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు అడాల్ఫ్ హిట్లర్‌కు సంబంధించిన అరుదైన ఫోటోలను వేలంలో ఉంచగా అనూహ్యమైన స్పందన లభించింది. వివరాలు వెల్లడించని ఓ వ్యక్తి ఊహించని విధంగా.. 41,000 డాలర్లు(సుమారు 27 లక్షలు) చెల్లించి ఆ ఫోటోలను సొంతం చేసుకున్నాడు.
హిట్లర్ చివరి రోజుల్లో గడిపిన 'ఫ్యూరర్ బంకర్'లో దొరికిన ఫోటోలను ఇటీవల సీ అండ్ టీ అనే సంస్థ వేలంలో ఉంచింది. బ్రిటన్‌లోని రాయల్ టన్‌బ్రిడ్జ్‌వెల్స్‌లో నిర్వహించిన ఈ వేలంలో.. హిట్లర్ చైర్‌లో కూర్చొని డాక్యుమెంట్‌లను పరిశీలిస్తున్న ఫోటోతో పాటు.. చిన్నారులతో ఉన్న ఫోటోలతో కూడిన ఆల్బంకు భారీ మొత్తం పలికింది. హిట్లర్ దంపతుల మరణానంతరం.. హిట్లర్ భార్య ఇవా బ్రాన్ బెడ్ రూంలో ఓ రష్యన్ సైనికుడికి 1945లో దొరికిన ఈ ఆల్బం తరువాతి కాలంలో ఓ ఫోటో గ్రాఫర్ చేతికి వెళ్లింది. 1945 ఎప్రిల్ 29న ఇవా బ్రాన్‌ను పెళ్లాడిన హిట్లర్.. మరుసటి రోజు భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.