బార్సిలోనా: స్పెయిన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. రాజు ఫెలిప్–6 ఆదేశాలను బేఖాతరు చేస్తూ త్వరలోనే స్వాతంత్య్రం ప్రకటించుకుంటామని కాటలోనియా నాయకులు బుధవారం తేల్చి చెప్పారు. మరోవైపు, దేశద్రోహం ఆరోపణలపై కాటలన్ వేర్పాటువాద నాయకులు, పోలీసులపై కోర్టులు విచారణను ముమ్మరం చేశాయి. స్పెయిన్ జాతీయ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన రాజు ఫెలిప్–6, కాటలోనియాకు స్వతంత్ర హోదానివ్వడం అప్రజాస్వామికమని పేర్కొనడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల మధ్య సామరస్యం నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. కాటలన్ నాయకులు బాధ్యతారాహిత్యంతో దేశ, ప్రాంత ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి చేటుచేస్తున్నారని విమర్శించారు. రాజు ప్రకటనపై కాటలన్ నాయకులు మండిపడ్డారు. కాగా, ఈ వారం చివరన లేదా వచ్చే వారం ప్రారంభంలో కాటలన్‌కు అక్కడి ప్రభుత్వం స్వాతంత్య్రం ప్రకటిస్తుందని వేర్పాటువాద నాయకుడు కార్లెస్ పుయిగ్‌డెమంట్ చెప్పారు. రెఫరెండం ఓట్ల లెక్కింపు పూర్తి కావొచ్చిందని కాటలన్ ప్రభుత్వ ప్రతినిధి జోర్డి తురుల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment