2117 నాటికి మార్స్‌పై సిటీ
దుబాయ్: మానవుడు తన మేధాశక్తికి సాంకేతికతను జోడించి అసాధ్యమ నుకున్న వాటిని సుసాధ్యం చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు ఇతర గ్రహాలపై పరిశోధనలకు మాత్రమే పరిమితమైన దీన్ని త్వరలోనే గ్రహాలపై గృహాలు, నగరాలు, ఆధునిక కట్టడాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇదే నిజమైతే రానున్న కాలంలో మనిషిని కూడా గ్రహాంతరవాసిగా పరిగణించే పరిస్థితి రానుంది. మరో వందేళ్లలో.. అంటే 2117 నాటికి అంగారకుడిపై మొట్టమొదటి నగరాన్ని నిర్మించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రణాళికలు రచిస్తోంది. దీంతోపాటు రానున్న దశాబ్దకాలంలో మనుషులను రవాణా చేసేందుకూ మార్గాలను అన్వేషిస్తోంది.
ఈ మేరకు రానున్న 100 ఏళ్ల జాతీయ ప్రణాళిక విధానాన్ని యూఏఈ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్దుమ్, అబుదాబీ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రకటించినట్లు గల్ఫ్ న్యూస్ తెలిపింది. రానున్న వందేళ్ల కాలంలో ఈ దిశగా పరిశోధనలు సాగించేందుకు పలు అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేయనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా అంతరిక్ష పరిశో ధనలు ప్రారంభించి యువతను ఆకర్షించను న్నట్లు తెలిపారు.
అలాగే మనుషులు, ఆహారం, ఇతర నిత్యావసరాలను పంపేందుకు భూమి, అరుణగ్రహం మధ్య వేగవంతమైన రవాణా మార్గాన్ని నిర్మించను న్నట్లు చెప్పారు. ‘ఇతర గ్రహాలపై అడుగుపెట్టడం మానవుని దీర్ఘకాల కోరిక. ఈ కలను యూఏఈ నిజం చేస్తుంది’ అని దుబాయ్ రాజు రషీద్ అన్నారు. మార్స్ పై పరిశోధనలకు తమ మొదటి అంతరిక్షనౌకను 2021 లో ప్రయోగించనున్నట్లు యూఏఈ ప్రకటించింది.