
2100 నాటికి 200 కోట్లు!
వాతావరణ మార్పుల వల్ల శరణార్థులుగా మారనున్న వారి సంఖ్య
వాషింగ్టన్: వాతావరణ మార్పుల కారణంగా సముద్రమట్టాల పెరుగుదల ప్రపంచానికి పెనుసవాలుగా మారనుంది. సముద్రమట్టాల పెరుగుదల వల్ల 2100 నాటికి ప్రపంచ జనాభాలో 5వ వంతు అంటే దాదాపు 200 కోట్ల మంది వారి ఆవాసాలు కోల్పోనున్నారు. దీంతో వీరంతా శరణార్థులుగా మారనున్నారని ఓ అధ్యయనంలో తేలింది. సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతాలు నీట మునుగుతాయని, దీంతో అక్కడ నివసిస్తున్న వారంతా ఎత్తైన ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
‘తక్కువ భూభాగంలో ఎక్కువ మంది నివసించే రోజులు అనుకున్న దానికన్నా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది’అని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చార్లెస్ గీస్లర్ హెచ్చరించారు. భవిష్యత్తులో సరాసరి సముద్ర మట్టాల పెరుగుదల నెమ్మదిగా ఉండకపోవచ్చని, అందరి శరణార్థుల్లాగే తీరప్రాంత శరణార్థులను కూడా అక్కున చేర్చుకునేందుకు దేశాలు అనుకూలమైన పాలసీలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
2100 నాటికి 1100 కోట్ల జనాభా!
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 900 కోట్లకు చేరనుంది. అదే 2100 నాటికి దాదాపు 1100 కోట్లకు చేరుకోనుంది. అయితే అంత జనాభాకు ఆహారం అందించాలంటే సారవంతమైన భూమి అవసరం. సముద్రమట్టాలు పెరిగి సారవంతమైన తీరప్రాంత భూములు, నదీ డెల్టా ప్రాంత భూములు మునిగిపోనున్నాయి.
2060 నాటికి 140 కోట్ల మంది ప్రజలు వాతావరణ శరణార్థులుగా మారనున్నారని వారి అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ‘ల్యాండ్ యూజ్ పాలసీ’జర్నల్‌లో ప్రచురితమైంది. ‘ప్రస్తుతమున్న గ్రీన్‌హౌజ్ వాయువుల స్థాయిని తగ్గించడమే మన లక్ష్యం. వాతావరణ మార్పులను అడ్డుకోవాలన్నా, సముద్ర మట్టాలు పెరగకుండా చూడాలన్నా ఇదొక్కటే మార్గం’అని గీస్లర్ పేర్కొన్నారు.