ఫైల్ ఫోటో
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని మరోసారి తీవ్రంగా ఆరోపించిన ఆయన అమెరికా ఈ రోజు డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాలను రద్దు చేయబోతోందన్నారు. తాము కోరిన విధంగా ఎంతో అవసరమైన సంస్కరణలు చేయడంలో విఫలమైనందున సంస్థ నుంచి వైదొలగుతున్నామన్నారు.
వైట్ హౌస్ రోజ్ గార్డెన్‌లో ట్రంప్ మాట్లాడుతూ డబ్ల్యూహెచ్‌ఓను బీజింగ్ సమర్థవంతంగా నియంత్రిస్తోందని, చైనా ప్రభుత్వ కోరిక మేరకే కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చైనాలో వైరస్ పుట్టుక, దాని వ్యాప్తి విషయాలను డబ్ల్యూహెచ్ఓ కప్పిపుచ్చిందని, సరిగ్గా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. దీనికి ఆ సంస్థ బాధ్యత వహించేలా తప్పకుండా చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 400 మిలియన్ల డాలర్లు (మూడు వేల కోట్ల రూపాయలకు పైగా) వార్షిక సహకారాన్ని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్ళించనున్నామని తెలిపారు. అమెరికాతో పోల్చితే సంవత్సరానికి కేవలం 40 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించే చైనా డబ్ల్యూహెచ్ఓను పూర్తిగా నియంత్రిస్తోందని మండిపడ్డారు.(సోషల్ మీడియాకు షాక్ : కత్తి దూసిన ట్రంప్)
కాగా కరోనా వైరస్ వ్యాప్తిపై స్పందించే విషయంలో డబ్ల్యూహెచ్ఓ తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమైందంటూ ఆరోపించడంతో పాటు డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తామంటూ గతంలోనే హెచ్చరించారు. తాత్కాలికంగా నిధులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విటర్ జోక్యం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాలపై కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. (‘థర్డ్ పార్టీ’ ప్రమేయం వద్దు)
Comments
Please login to add a commentAdd a comment