
విమానంలో గొడవ.. వైరల్ వీడియో!
అమెరికా అధక్ష ఎన్నికల ఫలితాలపై కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అసంతృప్తి ఉంది. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంపై ఓ విమానంలో ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా గొడవకు కారణమని తెలుస్తోంది. ఎంతసేపటికీ రెండు వర్గాల వారు వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో పైలట్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ వాగ్వివాదం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మెక్సికో(ప్యుయెర్టా వాల్లార్టా)కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది.
జాన్ బ్యుయర్ అనే వ్యక్తి విమానంలో జరిగిన తతంగాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో స్థానికంగా ఎంతో కలకలం రేపింది. ఆఫ్రో-అమెరికన్ మహిళను అగౌరవపరిచే వ్యాక్యలు చేయడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం పైలట్ వద్దకు చేరింది. 'మనం 35,000 అడుగుల ఎత్తులో వెళ్లబోతున్నాం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉండటం మంచిదే. కానీ ఇలాంటి సమయాలలో ఇవి తగవు' అని పైలట్ సర్దిచెప్పాడు. ఈ విషయంపై యునైటెడ్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మెక్ కార్తే మాట్లాడుతూ.. గొడవ జరిగిన విసయం వాస్తవమే. ఈ విషయంపై మా పైలట్ జోక్యం చేసుకుని అంతా సర్దుకునేలా చేశాడన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే చెప్పండి.. మరుసటి రోజు ఫ్లయిట్‌లో వెళ్లవచ్చు అని సూచించారు. విమానం నుంచి ఎవరినీ దింపి వేయలేదని మెక్ కార్తే చెప్పారు.